తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా వ్యాక్సిన్​ కూటమిలో చైనాకు చోటు! - china in COVAX

కరోనా వ్యాక్సిన్‌ను ప్రపంచ దేశాలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైన కోవాక్స్‌ కూటమిలో చేరేందుకు చైనా గ్రీన్​సిగ్నల్​ ఇచ్చింది. ఇందులో చేరేందుకు తొలుత నిరాకరించిన డ్రాగన్‌ దేశం.. ఇప్పుడు, వ్యాక్సిన్‌ అభివృద్ధి చేసే సామర్థ్యం ఉన్న ప్రతి దేశం దీనిలో చేరాలని పిలుపునిచ్చింది.

China joins COVAX coronavirus vaccine alliance
ఎట్టకేలకు కోవాక్స్‌ కూటమిలో చేరిన చైనా!

By

Published : Oct 9, 2020, 12:07 PM IST

కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసి అన్ని దేశాలకు సమానంగా అందించడమే లక్ష్యంగా ఏర్పాటైన 'కోవాక్స్'‌ కూటమిలో చేరేందుకు.. చైనా కూడా సిద్ధమైంది. ఈ మేరకు శుక్రవారం ఆ దేశ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ప్రకటన చేశారు. తొలుత ఈ కూటమిలో చేరేందుకు డ్రాగన్‌ నిరాకరించింది. అందరికీ సమానంగా వ్యాక్సిన్‌ అందాలన్న లక్ష్యంతోనే 'కోవాక్స్'‌లో చేరుతున్నట్లు చైనా తెలిపింది.

అందరికీ పిలుపు..

వ్యాక్సిన్‌ అభివృద్ధి చేసే సామర్థ్యం ఉన్న ప్రతి దేశం దీనిలో చేరాలని పిలుపునిచ్చింది చైనా. అయితే, ఈ కూటమిలో చైనా సహకారం ఎలా ఉండనుందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ప్రపంచ మానవాళి సంక్షేమం కోసమే చైనా వ్యాక్సిన్‌ తయారుచేస్తోందని గతంలో ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ప్రకటించారు. ప్రస్తుతం చైనాలో మూడు రకాల కరోనా వ్యాక్సిన్లు క్లినికల్‌ ట్రయల్స్‌ మూడో దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో చైనా.. కూటమిలో చేరింది.

వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన దేశాల నుంచి దాన్ని కొనుగోలు చేసి, ప్రపంచవ్యాప్తంగా పారదర్శకంగా సరఫరా చేయాలన్న లక్ష్యంతో 'కోవాక్స్'‌ ఏర్పాటైంది. అమెరికా మాత్రం దీనిలో చేరేందుకు విముఖత వ్యక్తం చేసింది. ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికాలోని అల్పాదాయ దేశాలు సైతం వేగంగా, పారదర్శకంగా, అందరితో సమానంగా కొవిడ్ టీకాను పొందేందుకు ఈ కూటమి కృషి చేస్తోంది. 2020 చివరికల్లా 200 కోట్ల డాలర్లు సమీకరించాలని దీనిలో చేరిన దేశాలు లక్ష్యంగా పెట్టుకొన్నాయి. దీని ద్వారా వ్యాక్సిన్ పరిశోధనలు, అభివృద్ధి, తయారీ, పంపిణీ సామర్థ్యం పెంచేందుకు ఆర్థిక సాయం అందనుంది. ఇప్పటికే అభివృద్ధి దశలో అనేక టీకా ప్రాజెక్టులను కోవాక్స్‌ పరిధిలోకి తీసుకొచ్చారు.

ఇదీ చదవండి: ఫిన్లాండ్‌ ప్రధానమంత్రిగా 16 ఏళ్ల బాలిక!

ABOUT THE AUTHOR

...view details