సంప్రదింపులు, చర్చల ద్వారా ఇతర దేశాలతో విభేదాలు, వివాదాల పరిష్కారానికి సిద్ధంగా ఉన్నామని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ గతంలో ప్రకటించారు. పరస్పర గౌరవం, సమానత్వం ప్రాతిపదికన అందరితో శాంతియుత సంబంధాలను నెలకొల్పుకోవాలన్నదే తమ ఉద్దేశమని వెల్లడించారు. చేతల్లో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. చైనా ఇటీవల కొత్త సరిహద్దు చట్టాన్ని(China New Border Law) పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. అది అమలులోకి రావడానికి రెండు నెలలు ఉండగానే, టిబెటన్(China Tibet News) ల సంఖ్యాధిక్యం గల సరిహద్దు ప్రాంతాలపై పట్టు బిగించడానికి డ్రాగన్ పావులు కదుపుతోంది. తన ఆశ్రితుడు పంచెన్ లామాను(China Panchen Lama) అడ్డుపెట్టుకొని టిబెటన్ల ఆదరణ పొందడానికి ప్రయత్నిస్తోంది.
అవకాశంగా మలచుకుంటోంది..
భారత్-చైనాల మధ్య సరిహద్దు గురించి ఇప్పటికీ స్పష్టత లేకపోవడాన్ని డ్రాగన్ అవకాశంగా మలచుకుంటోంది. ఇండియాను ఆనుకుని ఉన్న సరిహద్దు ప్రాంతంలో నివసిస్తున్న టిబెట్ జాతీయుల సామాజిక అభివృద్ధికి పంచెన్ లామా(China Panchen Lama) గైయింకైన్ నోర్బు ఇటీవల 1.56లక్షల డాలర్ల విరాళమిచ్చారు. చైనా అధీనంలో ఉన్న టిబెట్ స్వయంపాలిత ప్రాంతంలోని తాషిల్ హున్ పో విశ్వవిద్యాలయం నుంచి ఈ మధ్యనే ఆయన డాక్టరేట్ పట్టా అందుకున్నారు. ఈ సందర్భంగా తనకు అందిన నగదు కానుకల నుంచి ఆ మొత్తాన్ని 31 ఏళ్ల పంచెన్ లామా విరాళమిచ్చారు. గైయింకైన్ నోర్బును పంచెన్ లామాగా చైనాయే నియమించింది. టిబెటన్లలో దలైలామా పట్ల ఉన్న చెక్కుచెదరని అభిమానాన్ని చెదరగొట్టి తన పునాదులను పటిష్ఠపరచుకోవడానికి చైనా అండతో పంచెన్ పలు చర్యలు తీసుకుంటున్నారు. దానికి ప్రతిగా జాతీయ సరిహద్దులను సుస్థిరం చేసుకోవడంలో చైనాకు తోడ్పడుతున్నారు. టిబెటన్ బౌద్ధ సంప్రదాయం ప్రకారం దలైలామా తరవాతి స్థానం పంచెన్ లామాదే. తరవాతి దలైలామా ఎంపిక ప్రక్రియకు పంచెన్ నాయకత్వం వహిస్తారు. చైనా(China Tibet News) కనుసన్నల్లో పంచెన్ త్వరలోనే కొత్త దలైలామా ఎంపికకు శ్రీకారం చుట్టబోతున్నారు.
డ్రాగన్‌కు వీర విధేయుడు..
గత నెల 23న చైనా ప్రకటించిన కొత్త సరిహద్దు చట్టంలోని 11వ అధికరణ- దేశ సరిహద్దులో నివసించే ప్రజలను జాతీయ స్రవంతిలో మమేకం చేయడానికి తగిన ప్రచార, విద్యా కార్యక్రమాలను చేపట్టాలని నిర్దేశిస్తోంది. ఇక్కడ సరిహద్దు అంటే భారత సరిహద్దును ఆనుకుని ఉండే టిబెటన్ల నివాస ప్రాంతాలు. చైనా అభీష్టానికి అనుగుణంగా యువ టిబెటన్ బౌద్ధులు పెద్ద సంఖ్యలో సామాజిక కార్యకలాపాల్లో పాల్గొని జాతీయ సమైక్యతకు, సుస్థిర అభివృద్ధి సాధనకు పాటుపడాలని పంచెన్ లామా పిలుపిచ్చారు. ఆయన ప్రకటించిన విరాళాన్ని అభివృద్ధి కార్యకలాపాలకు, సరిహద్దులను పటిష్ఠం చేయడానికి వెచ్చిస్తారని అధికార ప్రకటన వివరించింది. పంచెన్ లామా మొదటి నుంచీ డ్రాగన్‌కు వీర విధేయుడు(China Panchen Lama). చైనాలో అత్యున్నత రాజకీయ సలహా బృందమైన ప్రజా రాజకీయ సంప్రదింపుల సంస్థ స్థాయీసంఘంలో ఆయన సభ్యుడు. చైనీస్ లక్షణాలు కలిగిన సామ్యవాదానికి అనుగుణంగా టిబెటన్ బౌద్ధం తనను తాను తీర్చిదిద్దుకొంటుందని, చైనీయీకరణ దిశగా పురోగమిస్తుందని గత మార్చిలో ఒక ముఖాముఖిలో పంచన్ ఉద్ఘాటించారు. అయితే, టిబెటన్లను చైనా జనజీవన స్రవంతిలో అంతర్భాగం చేసే ప్రయత్నాలు సఫలం కావడం లేదు.
ఇష్టపడటం లేదు..
పీఎల్‌ఏ(చైనా సైన్యం)లో చేర్చుకోవడానికి డ్రాగన్ ఎంతగా ప్రయత్నిస్తున్నా- టిబెటన్లు పోలీసు శాఖలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారే తప్ప... సైన్యంలోకి వెళ్ళడానికి ఇష్టపడటం లేదు. బౌద్ధ జనాధిక్య టిబెట్, ముస్లిం జనాధిక్య షింజియాంగ్‌ల అభివృద్ధికి చైనా ఎన్నో నిధులు కేటాయించి, పలు పథకాలు చేపట్టినా వారి ఆదరణను చూరగొనలేకపోతోంది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ గత జులైలో టిబెట్‌లో ఆకస్మిక పర్యటన జరిపారు. అంతకుముందు 2011లో ఉపాధ్యక్షుడి హోదాలో టిబెట్‌ను సందర్శించారు. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తరవాత ఆయన టిబెట్‌కు వెళ్ళడం అదే తొలిసారి. మొదట సరిహద్దు నగరం న్యింగ్చి, తరవాత టిబెట్ రాజధాని లాసాను సందర్శించారు. గతేడాది ఏప్రిల్-మే నెలల్లో భారత్, చైనాల మధ్య సరిహద్దు సంఘర్షణలు తలెత్తినప్పటి నుంచీ రెండు దేశాలూ వాస్తవాధీనరేఖ(ఎల్‌ఏసీ)పై సేనలను మోహరించాయి. ట్యాంకులు, ఫిరంగులు, డ్రోన్లు, హెలికాప్టర్ల మోహరింపులో ఉభయ పక్షాలూ పోటీపడుతున్నాయి. సరిహద్దులో ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో టిబెటన్లకు చేరువ కావడం ద్వారా చైనా తన ఎత్తులను పారించుకునే ప్రయత్నం చేస్తోంది. డ్రాగన్ జిత్తులను ఒక కంట కనిపెడుతూ, దేశ ప్రయోజనాలే పరమావధిగా ఇండియా అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంది.
- సంజీవ్ కె.బారువా
ఇవీ చూడండి: