China Invade Taiwan?: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం తైవాన్‌లో కొత్త భయాలను సృష్టిస్తోంది. రష్యాకు సరిహద్దున చిన్న దేశంగా ఉన్న ఉక్రెయిన్ తరహాలోనే చైనాకు తైవాన్ ఉంది. ఒకప్పుడు సొవియట్ యూనియన్‌లో ఉక్రెయిన్ భాగంకాగా తైవాన్ కూడా తమ దేశంలో భాగమని చైనా వాదిస్తోంది. వన్ చైనా విధానాన్ని ప్రపంచ దేశాలు ఆమోదించిన విషయాన్ని గుర్తు చేస్తోంది. ఉక్రెయిన్ ఆక్రమించేందుకు రష్యా యత్నించినట్లే చైనా కూడా ఎప్పుడెప్పుడు తైవాన్ను హస్తగతం చేసుకుందామా అన్న లక్ష్యంతో దశాబ్దాల కాలంగా పావులు కదుపుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగడంతో తైవాన్‌కు అదే పరిస్థితి ఎదురుకానుందా అన్న ప్రశ్న ఆ దేశ నాయకులను కలవరపెడుతోంది. సరిహద్దు దేశాలపై.. రష్యా అనుసరించే దురాక్రమణ విధానాలనే చైనా కూడా పాటిస్తుండటం వారి భయాలకు మరింత ఊతం ఇస్తోంది.
Russias Invasion of Ukraine: చైనా తమ దేశంపై ఆక్రమణకు దిగితే అమెరికా అండగా నిలుస్తుందని భావిస్తూ వస్తున్న తైవాన్.. ఉక్రెయిన్ విషయంలో అగ్రరాజ్యం మిన్నకుండిపోవడం చూసి తర్జన భర్జన పడుతోంది. ఉక్రెయిన్ తరహాలోనే.. తమ విషయంలోనూ అమెరికా ప్రేక్షకుడి పాత్ర పోషిస్తే తమ పరిస్థితి ఏంటని తైవాన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. చైనాకు తూర్పు తీరంలో 160 కిలోమీటర్ల దూరంలో 2.3 కోట్ల జనాభాతో ఉన్న తైవాన్ ద్వీపం తొలి నుంచి అమెరికాకు సన్నిహితంగా మెలుగుతోంది. అగ్రరాజ్యంతో తైవాన్‌కు ఎలాంటి సైనికపరమైన ఒప్పందాలు, సంబంధాలు లేనప్పటికీ చారిత్రక బంధాన్ని కలిగి ఉంది. ఈ బంధంతోనే మిలియన్ డాలర్ల ఆయుధాలను అమెరికా నుంచి తైవాన్ కొనుగోలు చేస్తోంది. దీంతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఉక్రెయిన్‌తో పోలిస్తే మెరుగ్గా ఉన్నట్లు తైవాన్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే యుద్ధ సమయంలో అమెరికా లెక్కలు తారుమారయ్యే అవకాశం కూడా లేకపోలేదని అంచనా వేస్తున్నారు.
ఉక్రెయిన్- రష్యా పరిస్థితే చైనా- తైవాన్ విషయంలో పునరావృతమయ్యే పరిస్థితి ఉండబోదని తైవాన్‌కు చెందిన సేవా రంగ నిపుణుడు ఈథన్ లిన్ అభిప్రాయపడ్డారు. ఇప్పట్లో తైవాన్‌పై సైనిక చర్యలకు దిగే ఆలోచన చైనాకు లేదని సింగపూర్‌లోని నాన్‌యాంగ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయ నిపుణుడు లి మిన్‌జియాంగ్ అంచనా వేశారు. అయితే ప్రస్తుత ఉక్రెయిన్- రష్యా పరిణామాలు చైనా ఆలోచనలను ప్రభావితం చేసే అవకాశం కూడా లేకపోలేదని ఆయన అభిప్రాయపడ్డారు.