తెలంగాణ

telangana

ETV Bharat / international

చైనాకు 'కరోనా' కష్టాలు- రికార్డు స్థాయికి ద్రవ్యోల్బణం - China inflation

కరోనా వైరస్​తో పోరాడుతున్న చైనాకు కొత్త కష్టాలు వచ్చి చేరుతున్నాయి. పలు ప్రధాన నగరాలకు రాకపోకలు నిలిపివేసిన నేపథ్యంలో ద్రవ్యోల్బణంపై ప్రభావం పడుతోంది. జనవరిలో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) 8 సంవత్సరాల గరిష్ఠానికి చేరింది.

China inflation
చైనా కరోనా

By

Published : Feb 10, 2020, 11:48 AM IST

Updated : Feb 29, 2020, 8:31 PM IST

చైనాలో కరోనా వైరస్​ ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపుతోంది. వైరస్​ కారణంగా ఇప్పటికే పలు నగరాలకు రవాణా సేవలు నిలిపివేయడం వల్ల వాణిజ్యానికి ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారుల ధరలు గరిష్ఠ స్థాయికి చేరుకుంటున్నాయి. వైరస్ కారణంగా చైనా నూతన సంవత్సర సమయంలో డిమాండ్ పడిపోవడం వల్ల ద్రవ్యోల్బణం అంచనాలను మించిపోతోంది.

రిటైల్ ద్రవ్యోల్బణంలో కీలకమైన వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) గత నెలలో 5.4 శాతంగా నమోదైంది. ఇది 8 సంవత్సరాల గరిష్ఠ స్థాయి. 2011 అక్టోబర్​లో నమోదైన 5.5 శాతం తర్వాత ఇదే అత్యధికం. మాంసం, కూరగాయల ధరలు ఆకాశాన్నంటడం వల్ల 2019 డిసెంబర్​లో 4.5 శాతంగా ఉన్న సూచీ 5.4 శాతానికి చేరింది. ఆహార ధరలు 20.6 శాతం పెరిగాయి.

"రవాణాకు ఉన్న అవరోధాల వల్ల పెద్ద నగరాలకు చేర్చే ముందే పళ్లు, కూరగాయలు, మాంసం వంటి కొన్ని ఆహార ఉత్పత్తులు పాడయ్యే అవకాశం ఉంది. ప్రజలందరూ ఆహార పదార్థాలను నిల్వచేసుకోవడానికి మొగ్గుచూపుతున్నారు. ఈ పరిస్థితుల్లో చాలా వరకు ధరలు పెరుగుతాయి."-లూ టింగ్​, నిపుణులు, నొమూరాసంస్థ

'పండగ సీజన్​ సంబంధిత కారణాలతో పాటు, కరోనా వైరస్ ప్రభావం కూడా ఈ పెరుగుదలపై ప్రభావం చూపింద'ని చైనా జాతీయ గణాంక సంస్థ పేర్కొంది.

పంది మాంసం ప్రభావం

ఆఫ్రికన్ స్వైన్​ ఫీవర్​ కారణంగా గతేడాది నుంచి చైనాలో పంది మాంసం ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. 2019 జనవరితో పోలిస్తే ఈ జనవరిలో పంది మాంసం ధర 116 శాతం పెరిగింది. ఈ ప్రభావం సీపీఐ పైనా పడిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఉత్పత్తిదారుల ధరల సూచీ సైతం జనవరిలో 0.1 శాతం పెరిగింది. 2019 డిసెంబర్​లో ఇది 0.5 శాతం పడిపోయింది.

ఇదీ చదవండి: దిల్లీ ఓటింగ్​ శాతం ప్రకటనలో ఎందుకింత జాప్యం?

Last Updated : Feb 29, 2020, 8:31 PM IST

ABOUT THE AUTHOR

...view details