తెలంగాణ

telangana

ETV Bharat / international

డ్రాగన్​ కుయుక్తులు- సరిహద్దుల్లో భారీ నిర్మాణాలు - డ్రాగన్​

వాస్తవాధీన రేఖకు చేరువగా చైనా అదనపు బలగాలను తరలిస్తోంది. బలగాల ఉపసంహరణకు తాము కట్టుబడి ఉన్నామంటూనే.. మరోవైపు కుయుక్తులు పన్నుతోంది. ఇంకా భారీ స్థాయిలో నిర్మాణాలు చేపడుతోంది. కదలికలు ఉపగ్రహాలకు చిక్కకుండా జామర్లు వినియోగిస్తోంది. అయితే.. చైనా చర్యల్ని నిశితంగా గమనిస్తోన్న భారత సైన్యం మరింత అప్రమత్తంగా ఉంటోంది.

China huge structures on the borders.. Utilization of jammers to avoid trapping satellites
డ్రాగన్​ కుయుక్తులు- సరిహద్దుల్లో భారీ నిర్మాణాలు

By

Published : Oct 24, 2020, 2:13 PM IST

సరిహద్దుల్లో చైనా కుయుక్తులు కొనసాగుతున్నాయి. వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) సమీపం నుంచి అధిక సంఖ్యలో బలగాలను వెనక్కి రప్పించుకునేందుకు తాము కట్టుబడి ఉన్నామంటూ ఓ వైపు నీతులు వల్లిస్తూనే.. ఆ దేశం ఎల్‌ఏసీకి చేరువగా అదనపు బలగాలను తరలిస్తోంది. భారీ స్థాయిలో నిర్మాణాలూ చేపడుతోంది. సరిహద్దుల్లో చైనా కదలికలు పెరుగుతుండటంతో భారత సైన్యం కూడా మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. డ్రాగన్‌ కదలికలపై నిరంతరం కన్నేసి ఉంచుతోంది.

ఇదీ చూడండి:యుద్ధ సన్నద్ధతతో సైన్యం​.. అశాంతి సృష్టిస్తే అంతే!

ఎల్‌ఏసీ నుంచి ఇప్పుడప్పుడే (కనీసం ఈ చలికాలం ముగిసేలోపు) బలగాలను వెనక్కి రప్పించే ఉద్దేశం చైనాకు ఉన్నట్లు కనిపించడం లేదు. ఆక్రమిత ఆక్సాయిచిన్‌ సహా సరిహద్దు వెంబడి పలు ప్రాంతాల్లో ఆయుధ నిల్వలను, సైనిక మోహరింపులను మరింత పెంచుకుంటుండటమే అందుకు నిదర్శనం. ఆక్సాయిచిన్‌లో ఎల్‌ఏసీకి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో డ్రాగన్‌ తాజాగా మూడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ నిర్మాణాన్ని చేపట్టినట్లు భారత సైన్యం గుర్తించింది. నాలుగు ఫుట్‌బాల్‌ మైదానాలకు సమాన విస్తీర్ణాన్ని కలిగి ఉండే ఆ నిర్మాణాన్ని బలగాలు, శతఘ్నులు, రాకెట్‌ రెజిమెంట్లను ఉంచేందుకు చైనా ఉపయోగించుకునే అవకాశముందని విశ్రాంత సైన్యాధ్యక్షుడొకరు తెలిపారు. సాధారణంగా ఎత్తయిన ప్రాంతాల్లో విధులు నిర్వర్తించేటప్పుడు సైనికులు అక్యూట్‌ మౌంటేన్‌ సిక్‌నెస్‌ వంటి అనారోగ్యం బారిన పడుతుంటారని, వారికి చికిత్స అందించే కేంద్రంగా ఆ నిర్మాణాన్ని వినియోగించుకునే అవకాశాలూ ఉన్నాయని పేర్కొన్నారు.

అరుణాచల్‌ సరిహద్దుల్లోనూ..

ఎల్‌ఏసీకి 82 కిలోమీటర్ల దూరంలో షింజియాంగ్‌లోనూ చైనా అదనపు బలగాలను మోహరిస్తోంది. ఆ ప్రావిన్సులోని హోటన్, కాంక్సివర్‌ మధ్య కొత్త రోడ్డును నిర్మిస్తోంది. ఆక్సాయిచిన్‌కు చేరుకునేందుకు ప్రత్యామ్నాయ రహదారిగా అది ఉపయోగపడనుంది. హోటన్‌ వైమానిక స్థావరంలో యుద్ధ విమానాలను డ్రాగన్‌ భారీగా సమకూర్చుకుంటోంది. అరుణాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దుల్లోనూ చైనా కార్యకలాపాలు ఊపందుకున్నాయి. అక్కడ తమ కదలికలను ప్రత్యర్థులు ఉపగ్రహాల సహాయంతోనూ గుర్తించకుండా ఉండేందుకుగాను కౌంటర్‌ స్పేస్‌ జామర్లను చైనా బలగాలు వినియోగిస్తున్నాయి. గగనతల రక్షణ వ్యవస్థ 'ఎస్‌-400'ను అరుణాచల్‌ సమీపంలో ఇప్పటికే మోహరించినట్లు సమాచారం.

ఆ సైనికుడి వద్ద ఖాళీ పెన్‌డ్రైవ్‌

ఇటీవల ఎల్‌ఏసీని దాటి భారత భూభాగంలోకి ప్రవేశించి పట్టుబడ్డ చైనా సైనికుడు వాంగ్‌ వద్ద ఓ ఖాళీ పెన్‌డ్రైవ్, మొబైల్‌ ఫోన్‌ ఉన్నట్లు తెలిసింది. సైనిక గుర్తింపు కార్డుతోపాటు నిద్రించడానికి ఉపయోగించే ఓ బ్యాగును కూడా అతడు తనతో తెచ్చుకున్నాడని భారత సైనిక వర్గాలు తాజాగా వెల్లడించాయి. తూర్పు లద్దాఖ్‌లో ఎల్‌ఏసీని దాటి వచ్చిన వాంగ్‌ను మన సైన్యం ఈ నెల 19న దెమ్‌చోక్‌ ప్రాంతంలో అదుపులోకి తీసుకుంది. అతడు దారి తప్పి వచ్చినట్లు నిర్ధారించుకొని, తిరిగి చైనాకు అప్పగించింది.

26 నుంచి సైనిక కమాండర్ల సదస్సు

చైనా, పాకిస్థాన్‌లతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నవేళ సైనిక సన్నద్ధతపై కీలక సమీక్షకు భారత్‌ సన్నద్ధమైంది. దేశ రాజధాని దిల్లీలో ఈ నెల 26 నుంచి 29 వరకు సైనిక కమాండర్ల సదస్సు (ఏసీసీ) జరగనుంది. చైనా, పాక్‌లతో ఏకకాలంలో యుద్ధం జరిగినాసరే ఎదుర్కొనేలా బలగాల సన్నద్ధతను ఇందులో సమీక్షించనున్నారు. ఆయుధాలు, మందుగుండు సామగ్రి నిల్వలు సరిపడా ఉన్నాయో లేవో పరిశీలించనున్నారు.

ఇదీ చూడండి:భారత్‌ను కట్టడి చేసేందుకు చైనా ఎత్తుగడ!

ABOUT THE AUTHOR

...view details