కశ్మీర్ విషయంలో భారత్‌పై మరోసారి చైనా అక్కసు వెళ్లగక్కింది. రెండు దేశాల మధ్య విభేదాలను భారత్, పాక్ చర్చల ద్వారా పరిష్కరించుకుంటాయని చెబుతూనే ఏకపక్ష మార్పులు అక్రమమని విషం చిమ్మింది. సంబంధాల బలోపేతం ద్వారా రెండు దేశాలు సంయుక్తంగా శాంతి, స్థిరత్వం, అభివృద్ధికి కృషి చేస్తాయని భావిస్తున్నట్లు తెలిపింది.
జమ్ముకశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు చేసి ఏడాది గడిచిన నేపథ్యంలో పాక్ పాత్రికేయుడు అడిగిన ప్రశ్నకు ఈ విధంగా సమాధానమిచ్చారు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్.
"కశ్మీర్ ప్రాంతంలో పరిస్థితిని చైనా నిశితంగా గమనిస్తోంది. ఈ విషయంలో మా వైఖరి స్థిరంగా, స్పష్టంగా ఉంది. ఇది ఆ రెండు దేశాల మధ్య చరిత్రకు సంబంధించిన వివాదం. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు, ఐరాస ఛార్టర్, భద్రతా మండలి తీర్మానాలు ఈ వాస్తవాన్నే వెల్లడిస్తు్న్నాయి. అయితే యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చటం అక్రమం. భారత్, పాక్ పొరుగుదేశాలు. ఈ విషయాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి."