అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సారథ్యంలో చైనాతో సంబంధాలు ఎన్నడూ లేనంతగా క్షీణించాయి. కరోనా వైరస్ ప్రభావం తర్వాత చైనా తీరుపై మరింత స్వరం పెంచిన ట్రంప్.. ఆ దేశంపై చర్యలు తప్పవని సమయం దొరికినప్పుడల్లా స్పష్టం చేస్తూనే ఉన్నారు. చైనాతో స్వేచ్ఛా వాణిజ్యం విషయంలో ఒబామా ప్రభుత్వ హయాంలో ఉపాధ్యక్షుడిగా ఉన్న బైడెన్ కీలకంగా వ్యవహరించినట్లు అధ్యక్ష అభ్యర్థుల సంవాదంలోనూ ట్రంప్ ఆరోపించారు. అంతేకాకుండా తాను మళ్లీ అధికారంలోకి వస్తే చైనాపై మరిన్ని చర్యలు తప్పవని తాజా ఇంటర్వూలోనూ హెచ్చరించారు ట్రంప్. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రత్యర్థి బైడెన్‌పైనే చైనా నేతలు ఆశలు పెట్టుకున్నట్టు అంతర్జాతీయ విశ్లేషకులు పేర్కొన్నారు.
చైనాపై గుర్రుగా..
కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ చూడని విధంగా అమెరికా-చైనా మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా కరోనా విషయంతోపాటు వాణిజ్యం, రక్షణ, టెక్నాలజీ విషయాల్లో ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింతగా క్షీణించాయి. ఇప్పటికే చైనీయుల వీసాలపై ఆంక్షలు విధిస్తుండటం సహా.. టెక్నాలజీ దిగ్గజం హువావే కూడా అమెరికా నుంచి తరలిపోవడంలో ట్రంప్ ప్రభుత్వం కీలకంగా వ్యవహరించింది. చైనా సామాజిక మాధ్యమాలపైనా కొరడా ఝులిపిస్తోంది అగ్రరాజ్యం. అటు హాంగ్‌కాంగ్, తైవాన్, షిన్ జియాంగ్, టిబెట్ ప్రాంతాల్లో జరుగుతోన్న చైనా ఆకృత్యాలపై కూడా అమెరికా మండిపడుతూనే ఉంది. ఇలాంటి సమయంలో మరికొన్ని రోజుల్లో ఏర్పడబోయే అమెరికా కొత్త ప్రభుత్వం చైనాపై ఎలా వ్యవహరిస్తుందనే విషయం ఆసక్తిగా మారింది.
అమెరికన్లలో పెరిగిన చైనా వ్యతిరేక భావన..
అయితే.. ఎక్కువమంది అమెరికన్లు చైనా తీరుపై వ్యతిరేకంగానే ఉన్నట్లు నివేదికలు ఇప్పటికే స్పష్టం చేస్తున్నాయి. గతంలో ఎన్నడూలేని విధంగా రెండో వంతు అమెరికన్లు చైనాను తీవ్రంగా వ్యతిరేకిస్తోన్నట్లు తాజాగా విడుదలైన పీఈడబ్ల్యూ పరిశోధన కేంద్రం నివేదిక స్పష్టంచేసింది. ఈస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం కావడం గడిచిన రెండు దశాబ్దాల్లో ఇదే తొలిసారని నిపుణులు పేర్కొన్నారు.