హిందూ మహాసముద్రంలో భారత ఆధిపత్యానికి సవాల్ విసిరేలా చైనా కొత్త ఎత్తుగడలు వేస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా ఈ సాగరంలో జలాంతర డ్రోన్లను భారీగా మోహరించింది. 'సీ వింగ్' అనే ఈ సాధనాలు నెలల తరబడి రహస్యంగా కార్యకలాపాలు సాగించగలవు. ప్రత్యర్థి యుద్ధనౌకల కదలికలపై సమాచారాన్ని సేకరించేందుకు ఇవి ఉపయోగపడతాయని రక్షణ విశ్లేషకుడు హెచ్‌ఐ సట్టన్ పేర్కొన్నారు.
ఈ డ్రోన్.. ఒకరకమైన మానవరహిత వాహనం (యూయూవీ). వీటిని 2019 డిసెంబర్‌లో చైనా రంగంలోకి దించింది. దాదాపు 3400 పరిశీలనలు చేపట్టాక ఫిబ్రవరిలో వాటిని వెలికి తీసింది. గతంలో అమెరికా నౌకాదళం లిట్టోరల్ బ్యాటిల్‌స్పేస్ సెన్సింగ్-గ్లైడర్ (ఎల్‌బీఎస్-జీ) అనే డ్రోన్‌ను దక్షిణ చైనా సముద్రంలో మోహరించింది. దీన్ని 2016 డిసెంబర్ 15న చైనా స్వాధీనం చేసుకుంది. వివాదం ముదరడంతో అమెరికాకు తిరిగి అప్పగించింది. ఆ తర్వాత అచ్చంగా అలాంటి సాధనాన్నే చైనా తయారు చేయడం గమనార్హం. ‘రివర్స్ ఇంజినీరింగ్’ పద్ధతిలో ఇతర దేశాల ఆయుధాలను కాపీ కొట్టడంలో డ్రాగన్‌కు అద్భుత ప్రావీణ్యం ఉంది.
గ్లైడ్‌లా..
'సీ వింగ్' నడవడానికి ఎలాంటి యంత్రాలు అవసరం లేదు. భారీ రెక్కల సాయంతో అది గ్లైడ్‌లా కదులుతుంది. ఇందులో బెలూన్‌లాంటి సాధనం ఉంటుంది. అందులో పీడనంతో కూడిన ఆయిల్ ఉంటుంది. ఈ ఆయిల్ నిండినప్పుడు ఇది ఉబ్బెత్తుగా మారుతుంది. ఫలితంగా ఈ డ్రోన్ నీటి కిందకు వెళ్లిపోతుంది. కొద్దిసేపటి తర్వాత బెలూన్‌లోని ఆయిల్ బయటకు వెళ్లిపోతుంది. ఫలితంగా డ్రోన్ నీటిపైకి వస్తుంది. ఈ రెండు రకాల విధానాల ద్వారా దీని పయనం సాగుతుంది. దీని తోక భాగంలో యాంటెన్నా ఉంటుంది. దీని సాయంతో చైనా యుద్ధనౌకలకు సమాచారాన్ని చేరవేస్తుంది. వేగంగా ప్రయాణించడం, చురుగ్గా విన్యాసాలు చేసే సామర్థ్యం లేకపోయినప్పటికీ దీర్ఘకాల నిఘా అవసరాలకు ఇది చక్కగా ఉపయోగపడుతుంది.