సరిహద్దుల్లో చైనా కొత్త కుట్రకు తెరలేపింది. పైకి చర్చలు, ఘర్షణ నివారణ చర్యలని నీతులు చెబుతున్నా అంతర్గతంగా మాత్రం సరిహద్దుల దగ్గర పరిస్థితులను మరింత ఉద్రిక్తంగా మార్చే ప్రయత్నాలే చేస్తోంది. అంతేకాదు.. ఇప్పుడప్పుడే సరిహద్దుల నుంచి వైదొలిగే ప్రసక్తి లేదన్న సంకేతాలు పంపుతోంది. తాజాగా సరిహద్దుల వెంబడి భారీస్థాయిలో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసే పనిలో శరవేగంగా పావులు కదుపుతోంది. ఉద్రిక్తతలు అధికంగా ఉన్న పాంగాంగ్ సరస్సులోని దక్షిణ భాగం వరకు కేబుళ్లను వేసేందుకు భారీ ఎత్తున తవ్వకాలు ప్రారంభించింది. ఈ విషయాన్ని భారత సైనిక అధికారులు ధ్రువీకరిస్తున్నారు. దీనిపై రాయిటర్ వార్తా సంస్థ.. వివరణ కోరినా స్పందించేందుకు చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ నిరాకరించింది. ఈ ఆందోళనకర పరిణామాన్ని భారత్ సునిశితంగా పరిశీలిస్తోంది.
'వేగవంతమైన సమాచారం కోసం చైనా ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ వేయడం ఆందోళన కలిగిస్తోంది' అని ఓ భారత అధికారి చెప్పారు. పాంగాంగ్ సరస్సు దక్షిణ భాగాన కొన్ని ప్రాంతాల్లో భారత్- చైనా సైనికులు కేవలం కొన్ని వందల మీటర్ల దూరంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో దక్షిణ భాగం వరకు కేబుళ్లు వేయడాన్ని భారత్ తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ కేబుళ్ల ద్వారా సరిహద్దుల్లోని దళాలకు వెనుకనున్న సైనిక స్థావరాల నుంచి సురక్షితమైన సమాచారం అందుతుంది. అంతేకాదు ఎప్పటికప్పుడు దృశ్యాలను, డాక్యుమెంట్లను పంపించుకోవచ్చు. 'రేడియోలో మాట్లాడితే దొరికిపోవచ్చు. సంకేతాలను అడ్డుకోవచ్చు. ఆప్టికల్ ఫైబర్‌తో అలాంటి పరిస్థితి ఉండదు. సమాచారం సురక్షితంగా ఉంటుంది' అని ఆ అధికారి చెప్పారు.