తెలంగాణ

telangana

ETV Bharat / international

జనాభా కట్టడి పేరిట ముస్లింలపై చైనా క్రూరత్వం - చైనా జననాల రేటు

చైనా ప్రభుత్వం తన దేశంలోని మైనారిటీల హక్కులు కాలరాస్తోంది. జనాభా నియంత్రణ పేరిట అల్పసంఖ్యాక వర్గాలపై కఠిన చర్యలు చేపడుతోంది. ఎక్కువ మంది సంతానం ఉన్నవారిని నిర్బంధ కేంద్రాలకు తరలిస్తోంది. అంతర్జాతీయ వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ చేపట్టిన విచారణలో ఈ విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయి.

China forces birth control on Uighurs to suppress population
జనాభా నియంత్ర పేరిట మైనారిటీలపై చైనా కృూరత్వం!

By

Published : Jun 29, 2020, 2:42 PM IST

చైనా ప్రభుత్వం తమ దేశంలోని మైనారిటీలకు వ్యతిరేకంగా కఠినమైన చర్యలు చేపట్టింది. ఓవైపు మెజారిటీలైన 'హన్' ప్రజలను ఎక్కువ సంతానం కలిగి ఉండేలా ప్రోత్సహిస్తూనే... మరోవైపు మైనారిటీల హక్కులను కాలరాస్తోంది. ముస్లిం జనాభాను తగ్గించడానికి ఉయ్​గుర్లు సహా ఇతర మైనారిటీల జనన రేట్లను తగ్గించడానికి ప్రయత్నిస్తోంది. బలవంతంగా గర్భ నియంత్రణ పద్ధతులను పాటించేలా ఒత్తిడి తీసుకొస్తోంది.

ప్రభుత్వ చర్యలను ఆ దేశంలోని మహిళలు బహిరంగంగానే వ్యతిరేకించినప్పటికీ... ఈ పద్ధతి గతంలో కంటే విస్తృతంగా మారిందని అసోసియేటెడ్ ప్రెస్(ఏపీ) వార్తా సంస్థ విచారణలో తేలింది. ప్రభుత్వ గణాంకాలు, అధికారిక పత్రాల సమాచారం సహా ఇదివరకు నిర్బంధంలో ఉన్న 30 మంది వ్యక్తులు, కుటుంబ సభ్యులు, నిర్బంధ కేంద్ర నిర్వాహకులను ఇంటర్వ్యూ చేసి ఈ విషయాలు సేకరించింది ఏపీ వార్తా సంస్థ.

మారణహోమం!

చైనాకు పశ్చిమాన ఉన్న షింజియాంగ్ పట్టణంలో ఈ ప్రక్రియ నాలుగు సంవత్సరాలుగా కొనసాగుతోందని అసోసియేటెడ్ ప్రెస్ పేర్కొంది. వేల సంఖ్యలో గర్భస్రావాలను సైతం నిర్వహించినట్లు ఏపీ పరిశోధనలో తేలింది. గర్బధారణను నిరోధించే సాధనాలైన ఐయూడీ, స్టెరిలైజేషన్ల వాడకం దేశవ్యాప్తంగా తగ్గినప్పటికీ.. షింజియాంగ్​లో పెరుగుతోందని... ఇవి పాటించని వారిని సామూహికంగా నిర్బంధిస్తోందని వెల్లడించింది. చాలా మందిని నిర్బంధ కేంద్రాలకు పంపించడానికి ఎక్కువ మంది పిల్లలు ఉండటమే ప్రధాన కారణమని పేర్కొంది. జనాభా నియంత్రణ పేరుతో మైనారిటీలపై చేపట్టిన ఈ అకృత్యాలు ఒక రకంగా మారణహోమం వంటిదని నిపుణులు పేర్కొన్న వ్యాఖ్యలను ప్రస్తావించింది.

దాడి చేసీ మరీ...

ఒకవేళ కుటుంబసభ్యులు తమ పిల్లలను దాచి ఉంచితే.. వారి కోసం పోలీసులు ఇళ్లపై దాడి కూడా చేస్తున్నట్లు అసోసియేటెడ్ ప్రెస్ గుర్తించింది. ఇలాగే చైనాలో జన్మించిన కజక్​(టర్కీకి చెందిన జాతి) జాతికి చెందిన గుల్నార్ ఒమిర్జక్ అనే మహిళకు ముగ్గురు పిల్లలు ఉన్నారని తెలుసుకున్న ప్రభుత్వం... గర్భనిరోధక పరికరాలు అమర్చుకోవాలని ఆదేశించినట్లు తెలిపింది. మూడు రోజుల్లోగా రెండు లక్షల రూపాయలను కట్టాలని రెండు సంవత్సరాల తర్వాత జరిమానా విధించిందని వెల్లడించింది.

"పిల్లల్ని కనకుండా అడ్డుకోవడం చాలా తప్పు. ప్రజలుగా మమ్మల్ని నాశనం చేయాలని వారు అనుకుంటున్నారు. జనాభా నియంత్రణ పేరిట ప్రచారం చేస్తూ పిల్లల్ని కలిగి ఉన్న కుటుంబాల చుట్టూ బీభత్సమైన వాతావరణం సృష్టిస్తున్నారు."

-ఒమిర్జాక్, బాధిత మహిళ

కూరగాయలు అమ్ముతూ జీవించే ఒమిర్జాక్ భర్త ఇప్పటికే నిర్బంధంలో ఉన్నట్లు ఏపీ పేర్కొంది. ఒకవేళ అంత డబ్బు చెల్లించకపోతే ఆ మహిళను సైతం నిర్బంధంలో ఉంచాల్సి వస్తుందని అధికారులు హెచ్చరించినట్లు తెలిపింది. ఇప్పటికే లక్షలాది మంది అల్ప సంఖ్యాక మైనారిటీలను నిర్బంధించారని స్పష్టం చేసింది.

తగ్గుతున్న జననాల రేటు

చైనా ప్రభుత్వ గణాంకాల ప్రకారం హోటాన్, కశ్గర్ ప్రాంతాల్లో 2015 నుంచి 2018 మధ్య జనన రేటు 60 శాతంగా ఉంది. షింజియాంగ్ ప్రాంతంలో జనన రేటు గణనీయంగా పడిపోయింది. గతేడాది దేశవ్యాప్తంగా జనన రేటు 4.2 శాతం తగ్గగా.. షింజియాంగ్​లో 24 శాతం తగ్గిపోయింది.

జననాల రేటును తగ్గించడానికి చైనా ప్రభుత్వం కొన్నేళ్లుగా లక్షల కొద్దీ డాలర్లు ఖర్చుచేస్తోంది. దీని ఫలితంగా అత్యంత ఎక్కువ జననాల రేటు ఉన్న షింజియాంగ్​లో​ కొద్దికాలంలోనే గణనీయమైన తగ్గుదల నమోదైంది.

"ఇలాంటి తగ్గుదల ఊహించలేనిది. ఇందులో క్రూరత్వం దాగి ఉంది. ఉయ్​గర్లను అణచివేసేందుకు రచించిన విస్తృత నియంత్రణ ప్రచారంలో ఇది ఒక భాగం."

-అడ్రియన్ జెంగ్, చైనా మైనారిటీ వ్యవహారాల నిపుణుడు

చైనా ఇదివరకు పాటించిన 'ఏక-సంతాన' విధానాన్ని 'హాన్'​ చైనీయులపైనా కఠినంగా అమలు చేశారు. గర్భనిరోధకాలు, బలవంతపు గర్భస్రావాలు సైతం నిర్వహించారు. అయితే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన మైనారిటీలు మాత్రం ఇద్దరు పిల్లలు కనడానికి అనుమతించారు. తర్వాతి కాలంలో అధ్యక్షుడు షీ జిన్​పింగ్ మైనారిటీలకు ఇచ్చిన ప్రయోజనాలన్నింటినీ రద్దు చేశారు. 2014లో షింజియాంగ్​ను సందర్శించిన అనంతరం ప్రజలందరికీ సమానంగా కుటుంబ నియంత్రణ చేపట్టాలని నిర్ణయించారు.

ఆ తర్వాత 'హాన్' చైనీయులు ఇద్దరు పిల్లల్ని, షింజియాంగ్​లోని గ్రామీణ ప్రాంతాల్లో ముగ్గురు పిల్లల్ని కనేందుకు అనుమతి ఇచ్చారు. కానీ, ఎక్కువ మంది సంతానం కలిగి ఉన్నందుకు షింజియాంగ్​లోని అల్పసంఖ్యాక మైనారిటీలపై ఇప్పటికీ కఠిన చర్యలు కొనసాగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రభుత్వం అనుమతించిన ప్రకారం ముగ్గురు సంతానం ఉన్నప్పటికీ.. కొంతమందిని కిరాతకంగా శిక్షిస్తున్నారు.

"ఇది ఉయ్​గుర్ల గుర్తింపు, విశ్వాసాలపై చైనా ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం చేస్తున్న దాడి. చైనాలో మెజారిటీలుగా ఉన్న హాన్​ సంస్కృతిలో వీరు కలిసిపోవాలని ఈ విధమైన మార్గం అనుసరిస్తున్నారు."

-నిపుణులు

నిర్బంధించిన వారికి శిబిరాల్లో బలవంతంగా మతపరమైన బోధనలు చేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. చిన్నారులను అనాధాశ్రమాలకు తరలించి.. కుటుంబసభ్యులను కర్మాగారాల్లో బలవంతంగా పనిచేయిస్తున్నట్లు చెప్పారు. ఉయ్​గుర్లపై డిజిటల్ పరికరాల ద్వారా నిరంతర నిఘా ఉంచుతున్నట్లు ఆరోపిస్తున్నారు.

ఇదీ చదవండి-కశ్మీర్​ రాజకీయాల్లో పెనుమార్పు- హురియత్​కు గిలానీ గుడ్​బై

ABOUT THE AUTHOR

...view details