కరోనా కేసుల వివరాలను, వైరస్ మూలాలను దాస్తోందని అమెరికా చేసిన ఆరోపణలను తిప్పికొట్టింది చైనా. ప్రజల దృష్టిని మళ్లించేందుకే.. వుహాన్ ప్రయోగశాలలో వైరస్ను తయారు చేసినట్లు ఆరోపణలు చేస్తోందని విమర్శించింది.
ఈ రోజు ఉదయం.. వుహాన్లో మరణాల రేటును ఒక్కసారిగా 50 శాతం పెంచింది చైనా. మొత్తం కేసుల సంఖ్యను 4,632 సవరించిన సందర్భంగా వివరణ ఇచ్చారు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియాన్.
" అంతర్జాతీయంగా ఆమోదించిన పద్ధతిలోనే కరోనా సమాచారాన్ని సవరించినట్లు నొక్కిచెప్పాలనుకుంటున్నా. వైరస్ వ్యాప్తి తొలినాళ్లలో సమాచారం అందటంలో ఆలస్యం, లోపాలు ఉన్నాయి. ఆస్పత్రుల్లో తగినంత సామర్థ్యం లేకపోవటం, కొన్ని వైద్య సంస్థలు వ్యాధి నివారణ, సమాచార వ్యవస్థలతో సకాలంలో అనుసంధానం కాకపోవటం ఇందుకు కారణం. కానీ.. మేము ఎప్పుడూ సమాచారం దాయలేదు. దాచిపెట్టడాన్ని అనుమతించం కూడా. "
- జావో లిజియాన్, చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి.