అఫ్గాన్‌లో తాలిబన్ల(Afghanistan Taliban) ప్రభుత్వాన్ని మొదటి నుంచి సమర్థిస్తూ వస్తున్న చైనా.. మరో అడుగు ముందకేసింది. ఆ దేశానికి తొలి విడతగా 31 మిలియన్ డాలర్ల విలువైన మానవతా సాయాన్ని(China Help Afghanistan) అందజేసింది. ఇందులో భాగంగా.. దుప్పట్లు, జాకెట్లు వంటివి అఫ్గాన్‌కు సరఫరా చేసింది. ఇవి బుధవారం రాత్రి.. కాబుల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాయని(China Help Afghanistan) చైనా అధికారిక వార్తా సంస్థ 'జిన్హువా' వెల్లడించింది.
కాబుల్‌కు చేరుకున్న ఈ వస్తువులను అఫ్గానిస్థాన్‌కు చైనా రాయబారి వాంగ్ యూ, అఫ్గాన్ ఆపద్ధర్మ ప్రభుత్వంలోని శరణార్థి వ్యవహారాల శాఖ మంత్రి ఖలీల్-ఉర్-రెమహాన్ హక్కానీ.. విమానాశ్రయంలో అందుకున్నారు. ఎన్నో సవాళ్ల మధ్య చైనా తక్కువ వ్యవధిలోనే అప్గాన్‌కు మానవతా సాయం కింద ఈ వస్తువులను అందజేసిందని వాంగ్ యూ చెప్పారు.
"శీతాకాలంలో అఫ్గాన్ ప్రజలకు ఉపయోగపడే బ్లాంకెట్లు, జాకెట్లు వంటివి అఫ్గాన్‌కు చైనా అందజేసింది. భవిష్యత్తులోనూ అప్గాన్‌కు ఆహారం సహా ఇతర వస్తువులను మేం సరఫరా చేస్తాం. అతి త్వరలోనే అవి అఫ్గాన్‌కు చేరుతాయి."
-వాంగ్ యూ, అఫ్గాన్‌కు చైనా రాయబారి
'చైనా మాకు మంచి మిత్ర దేశం'
చైనా చేసిన సాయానికిగాను హక్కానీ ఆ దేశానికి కృతజ్ఞతలు తెలిపారు. చైనా తమకు మంచి పొరుగుదేశం, మిత్రదేశం అని పేర్కొన్నారు. రానున్న రోజుల్లోనూ తమకు చైనా నుంచి సాయం(China Help Afghanistan) అందుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.
"సమ్మిళిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన మాటను మేము నిలబెట్టుకుంటాం. అప్గాన్‌ను విదేశీ ఉగ్రశక్తులకు అడ్డాగా మారనివ్వబోమని అంతర్జాతీయ సమాజానికి, పొరుగు దేశానికి ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటాం.
- ఖలీల్-ఉర్-రెమహాన్ హక్కానీ, అఫ్గాన్ శరణార్థి వ్యవహారాల శాఖ మంత్రి.