చైనాలోని గ్వాంగ్‌జీ ప్రాంతంలోని ఓ చిన్న రిజర్వాయర్‌పై నిర్మించిన డ్యామ్.. జూన్ 7 న భారీ వర్షాల కారణంగా కుప్పకూలింది. డ్యామ్‌లోని వరద నీరు సమీపంలోని యాంగ్షో నగరం, షాసిగ్జీ గ్రామాలపై సునామీలా విరుచుకుపడింది. ఫలితంగా రోడ్లు, తోటలు, పొలాలు నామరూపాల్లేకుండాపోయాయి. పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్లు కూడా వరద కోరల్లో చిక్కుచిక్కుకొని బిక్కుబిక్కుమంటున్నాయి. ఇప్పట్లో కోలుకోని విధంగా.. ఎటు చూసినా వరద విలయం స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి వరదలను తానెప్పుడూ చూడలేదని దశాబ్దాల కిందట డ్యామ్ నిర్మాణంలో సహాయపడిన స్థానిక గ్రామస్థుడు లుయో కివియాన్ తెలిపారు. లక్షా 95 వేల క్యూబిక్ మీటర్ల నీటి సామర్థ్యంతో 1965లో పూర్తయిన ఈ ఆనకట్ట.. షాసిగ్జీ ప్రాంత నీటి పారుదల అవసరాలను గత 50 ఏళ్లుగా తీర్చింది.
94 వేల ఆనకట్టలకు ముప్పు..
వ్యవసాయ ఆధారిత దేశం చైనాలో కరవును నివారించడానికి అప్పటి అధ్యక్షుడు మావో జెడాంగ్ పెద్ద ఎత్తున ఆనకట్టల నిర్మాణానికి పూనుకున్నారు. 1950-60 కాలంలో హడావుడిగా వేలాది ఆనకట్టలను నదులపై నిర్మించారు. అందులో చాలా వరకు నదులు నాసిరకంగా నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి. 1954-2005 మధ్య కాలంలో చైనాలో దాదాపు 3,486 జలాశయాల రాతికట్టలు తెగిపోయినట్టు ఆ దేశ నీటిపారుదలశాఖ ఓ నివేదికలో పేర్కొంది. చైనాలో గత కొన్నేళ్లుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు పొటెత్తుతున్నాయి. వరదల ధాటికి డ్యామ్‌ల రక్షణ సామర్థ్యం తగ్గిందని చైనా హైడ్రాలజీ విభాగం పేర్కొంది. దాదాపు 94 వేల ఆనకట్టలు వరద ముప్పును ఎదుర్కొంటున్నాయని హెచ్చరించిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.