తెలంగాణ

telangana

ETV Bharat / international

'క్వాడ్' స్కెచ్​తో చైనాలో కంగారు- భారత్​పై ఫైర్​ - China criticises on Quad meet

భారత్‌, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌ కూటమిగా ఏర్పాటు కావడంపై విమర్శలు గుప్పించింది చైనా. శాంతి, అభివృద్ధి, ప్రపంచ సహకారాన్ని అధిగమించటం ఇప్పుడు ట్రెండ్‌గా మారిందని మండిపడింది.

China criticises forthcoming Quad Foreign Ministers meet in Japan
'ప్రపంచ సహకారాన్ని అధిగమించడమే ట్రెండ్‌గా మారింది'

By

Published : Sep 29, 2020, 7:03 PM IST

భారత్‌, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ ‌దేశాలు చతుర్భజ కూటమిగా ఏర్పాటు కావటంపై చైనా విమర్శలు గుప్పించింది. మూడో పార్టీ ప్రయోజనాలను దెబ్బతీసే ప్రత్యేక కూటమి ఏర్పాటుకు తాము వ్యతిరేకమని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ అన్నారు. శాంతి, అభివృద్ధి, ప్రపంచ సహకారాన్ని అధిగమించటం ఇప్పుడు ట్రెండ్‌గా మారిందని విమర్శించారు.

బహుపాక్షిక సహకారం సమగ్రంగా, పారదర్శకంగా ఉండాలని, ప్రత్యేక కూటమిని ఎవరూ కోరుకోకూడదని వాంగ్‌ వెన్‌బిన్‌ పేర్కొన్నారు. మూడో పార్టీని లేదా మూడో పార్టీ ప్రయోజనాలను దెబ్బతీసేలా కాకుండా ప్రాంతీయ దేశాల మధ్య పరస్పర అవగాహన, విశ్వాసం పెంపొందించే దిశగా ప్రయత్నాలు జరగాలన్నారు.

డ్రాగన్​కు మూకుతాడు!

చైనా దురుసు ప్రవర్తన పెరిగే కొద్దీ వ్యతిరేక దేశాల్లో సమష్టితత్వం పెరుగుతోంది. డ్రాగన్‌ ఇప్పటికే జపాన్‌, భారత్‌, ఆస్ట్రేలియా, అమెరికాతో వైరం పెంచుకొంది. చైనా దుందుడుకు చర్యలతో ఆయా దేశాలు ఏకతాటిపైకి వచ్చి డ్రాగన్‌ను కట్టడిచేసే వ్యూహానికి పదును పెడుతున్నాయి. అందులో భాగంగా చతుర్భుజ కూటమిని క్రియాశీలకంగా మార్చేందుకు చర్యలు చేపట్టాయి.

ఇండో-పసిఫిక్​ అంశంపై చర్చ..

భారత్‌, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌(క్వాడ్‌) విదేశాంగ శాఖ మంత్రులు వచ్చే నెల టోక్యోలో భేటీ కానున్నారు. నాలుగు దేశాల సంయుక్త సమస్యలపై చర్చించనున్నారు. ఈ సమావేశాలకు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ హాజరు కానున్నారు. ఈ విషయాన్ని జపాన్‌ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి తొషిమిత్సు మోటెగీ ప్రకటించారు. ఈ సమావేశంలో నాలుగుదేశాల సమస్యలతోపాటు స్వేచ్ఛాయుత ఇండో-పసిఫిక్ అంశంపై చర్చించనున్నారు.

క్వాడ్‌ బృందంలో అమెరికా దూకుడు

ఇండో-పసిఫిక్‌లోకి దక్షిణ చైనా సముద్రం కూడా వస్తుంది. ఆ ప్రాంతంలో చైనా ఆధిపత్యానికి ఎలా చెక్‌ పెట్టాలన్న విషయం కూడా చర్చకు రానుంది. క్వాడ్‌ బృందంలో అమెరికా దూకుడు చైనాను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే ఐరాస సాధారణ సభలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చైనా పేరు నేరుగా ప్రస్తావించారు. కరోనా వ్యాప్తికి కారణమని నిందించారు. అమెరికా ఎన్నికల నేపథ్యంలో క్వాడ్‌ బృందాన్ని కూడా దూకుడుగా ముందుకు తెస్తే డ్రాగన్‌ తగ్గాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఇండో-పసిఫిక్‌ వ్యూహం... భారత్‌ కేంద్రంగా తయారైంది. హిందూ మహా సముద్రంలో భారత్‌ తిరుగులేని శక్తి. ఈ క్రమంలో మిగిలిన దేశాలు భారత్‌తో కలిసి చైనాకు చెక్‌ పెట్టాలని చూస్తున్నాయి.

జపాన్​ ప్రధాని ఆసక్తి

జపాన్‌ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన యషిహిడు సుగా కూడా క్వాడ్‌పై ఆసక్తిగా ఉన్నారు. ఆయన వచ్చేవారం అమెరికా, భారత్‌, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రులతో వ్యక్తిగతంగా భేటీ అయ్యే అవకాశాలున్నాయి. భారత్‌ ఈ కూటమిలో తన స్థానం బలోపేతం చేసుకోవడానికి రష్యాలో జరుగుతున్న 'కావ్‌కాజ్' ‌యుద్ధ విన్యాసాలకు గైర్హాజరైంది. అదే సమయంలో జపాన్‌తో కలిసి అరేబియాసముద్రంలో జిమెక్స్‌-20 పేరుతో యుద్ధ విన్యాసాలు చేసింది. ఇవన్నీ భవిష్యత్తులో ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో బలోపేతం కానున్న చతుర్భుజ బంధానికి సంకేతంగా నిలుస్తున్నాయి.

ఇదీ చూడండి:వచ్చే వారం జపాన్​లో జైశంకర్ పర్యటన

ABOUT THE AUTHOR

...view details