China Covid Strategy: గత రెండు సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా చైనాలో ఇప్పుడు కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. రోజూ వందలాది మంది ప్రజలు.. వైరస్ బారిన పడుతున్నారు. జీరో టాలరెన్స్ విధానంతో ఇన్ని రోజులూ వైరస్‌ను కట్టడి చేస్తూ వచ్చిన డ్రాగన్ దేశం తాజాగా ఆ పద్ధతికి నెమ్మదిగా ముగింపు పలకాలని చూస్తోంది. చైనా తీసుకున్న ఈ నిర్ణయం పట్ల భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. డ్రాగన్ మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకునే సమాధానాలు చెబుతోంది. ఇప్పటివరకు ఒక్క కొవిడ్ కేసు నమోదైనా నగరాలకు నగరాలు లాక్‌డౌన్ విధిస్తూ విస్తృతంగా కరోనా పరీక్షలను చైనా చేపట్టేది. తాజాగా స్టెల్త్ ఒమిక్రాన్ కేసులు డ్రాగన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
Zero Tolerance Approach: జీరో కొవిడ్ విధానం ఉన్నా స్టెల్త్ ఒమిక్రాన్ కేసులు చైనాలో తగ్గడం లేదు సరికదా ఆర్థిక వ్యవస్థకు అపార నష్టం చేకూరుతోందని చైనా ఆలస్యంగా గుర్తించింది. అందుకే జీరో కొవిడ్ విధానాన్ని సవరించాలని భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వ్యాక్సిన్లు వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొంటాయని చైనా వైద్యుడు జాన్ వెన్‌హాంగ్ అన్నారు. టీకాలు వైరస్‌ను బలహీన పరుస్తాయని తెలిపారు. వైరస్ కట్టడికి కీలకమైన వ్యాక్సిన్లపై దృష్టి పెట్టాల్సిన అవసరముందని పేర్కొన్నారు. జీరో టాలరెన్స్ విధానంపై చర్చించడం వల్ల ప్రయోజనం లేదని సూచించారు.
Stealth Omicron: చైనాలో కొవిడ్ కేసులు పెరగడానికి ప్రజల్లో వ్యాధి నిరోధక శక్తి లేకపోవడమే కారణమని మరో వైద్యుడు యాన్‌జాంగ్ హాంగ్ అన్నారు. చైనాలో దేశీయంగా తయారు చేసిన వ్యాక్సిన్లు వాడుతున్నారని తెలిపిన ఆయన.. అవి ఫైజర్ వ్యాక్సిన్లా సమర్థంగా పని చేయట్లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ గురువారం తీసుకున్న నిర్ణయం ఆసక్తిగా మారింది.