చైనాను నియంత్రించాలని ఇటీవల జరిగిన జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సులో అమెరికా పిలుపునిచ్చిన నేపథ్యంలో... ఆ దేశాలను ఎదుర్కొనేందుకు చైనా సన్నద్ధమవుతోంది. 'వోల్ఫ్ వారియర్'గా పిలిచే దుందుడుకు దౌత్య విధానాన్ని ఇకపై అనుసరించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా తమపై ఆంక్షలను విధించకుండా విదేశాలను అడ్డుకోవాలని భావిస్తోంది.
సదస్సుకు ముందే ఆ చట్టం...
రెండేళ్లుగా జిన్‌పింగ్ తమ దౌత్యవేత్తలను పోరాట పంథాను అలవర్చుకోవాలని ఆదేశిస్తున్నారని జియాన్లీ యాంగ్ అనే విశ్లేషకుడు 'న్యూస్‌వీక్' అనే పత్రికకు రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. అమెరికా-చైనా సంబంధాలు సహా అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కోవటంలో కఠిన వైఖరిని అవలంబించాలని సూచిస్తున్నట్లు తెలిపారు. ఈ వాదనలకు బలం చేకూర్చేలా.. ఇంగ్లాండ్‌లో 47వ జీ7 సదస్సు ప్రారంభానికి ముందే.. ఓ కొత్త చట్టాన్ని చైనా పార్లమెంటు ఆమోదించింది. షింజియాంగ్‌లో బలవంతపు కార్మిక విధానాలు, హాంకాంగ్‌లో మానవ హక్కుల ఉల్లంఘనకు చైనా పాల్పడుతోందంటూ అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో... చైనాకు చెందిన పలు సంస్థలపై యూరోపియన్ యూనియన్ దేశాలు ఆంక్షలను విధించాయి. ఈ క్రమంలో వాటిని ఎదుర్కొనేందుకు ఈ చట్టాన్ని చైనా తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.