అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమేనన్న వాదనలకు బలం చేకూర్చుకునే దిశగా చైనా కుయుక్తులు పన్నుతోంది. భారత్ సరిహద్దుకు సమీపంలో కొత్తగా గ్రామాలను ఏర్పాటు చేస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి నవంబరు మధ్య అక్కడ కనీసం మూడు ఊర్లు వెలిసినట్లు ఉపగ్రహ ఛాయాచిత్రాలు తాజాగా నిర్ధరించాయి. భారత్లోకి చొరబాటుదారులను పంపించేందుకూ ఈ గ్రామాలను డ్రాగన్ ఉపయోగించుకునే అవకాశముంది.
పశ్చిమ అరుణాచల్ ప్రదేశ్లో భారత్, చైనా, భూటాన్ సరిహద్దులు కలిసే చోటుకు సమీపంలో బుమ్ లా పాస్ ఉంది. అక్కడికి దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలో మూడు గ్రామాలను నిర్మించింది. వాటి మధ్య పరస్పర దూరంలో ఒకే ఒక్క కిలోమీటర్లు. గ్రామాలన్నింటినీ తారు రోడ్డుతో అనుసంధానించారు. ఒక్కో ఊర్లో కనీసం 50 నిర్మాణాలున్నాయి. కొండ ప్రాంతాల్లో చెక్కలతో నిర్మించే ఇళ్లలా అవి కనిపిస్తున్నాయి. వాటికి విద్యుత్తు, నీరు, అంతర్జాలం వంటి అన్ని సౌకర్యాలున్నాయి. ఆ గ్రామాల్లో ఉండేవారి పని సరిహద్దుల్లో గస్తీ కాయడమేనని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు సరిహద్దుల్లో తమ సంఖ్యాబలం తక్కువగా ఉన్న కోనా ప్రాంతానికి (షన్నన్ కౌంటీ)960 కుటుంబాలకు చెందిన 3,222 మందిని తరలించాలని చైనా భావిస్తోంది. డోక్లాంలో భారత్ బలగాలతో 2017లో తీవ్ర ప్రతిష్టంభన నెలకొన్న ప్రాంతానికి కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలో.. భూటాన్ భూభాగంలో గ్రామాలను చైనా నిర్మిస్తున్నట్లు ఇటీవల ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో కనిపించడం కలకలం సృష్టించింది.