చైనా తీరుపై ఇప్పటికే గుర్రుగా ఉన్న అమెరికా చర్యలకు ఉపక్రమించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా చైనా యాప్‌లపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. చైనా కంపెనీలపై ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై డ్రాగన్ మండిపడుతోంది. తాజాగా టిక్‌టాక్, వీచాట్ యాప్‌లను నిషేధిస్తున్నట్లు అమెరికా ప్రకటనపై చైనా వాణిజ్యశాఖ స్పందించింది. చైనా సంస్థలపై చర్యలు తీసుకోవడం ద్వారా అమెరికా బెదిరింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించింది.
అయితే, ఇకనైనా ఇలాంటి బెదిరింపులను మానుకోవడంతోపాటు చైనా సంస్థలపై అనైతిక చర్యలను నిలిపివేయాలని అమెరికాకు సూచించింది. అంతర్జాతీయ నియమాలను పాటిస్తూ నైతికత, పారదర్శకతతో కార్యకలాపాలను నిర్వహించాలని విజ్ఞప్తి చేసింది. ఒకవేళ అమెరికా ఇలాగే ఏకపక్ష ధోరణిలో ముందుకెళ్తే మాత్రం దీటుగా స్పందిస్తామని హెచ్చరించింది. చైనా కంపెనీల ప్రయోజనాలను కాపాడటం కోసం అవసరమైన చర్యలకు ఉపక్రమించక తప్పదని చైనా వాణిజ్యశాఖ స్పష్టం చేసింది.