కరోనా వైరస్ వ్యాపించిన మొదట్లో సేకరించిన నమూనాలను నాశనం చేయాలని తామే ఆదేశించినట్లు చైనాకు చెందిన 'నేషనల్ హెల్త్ కమిషన్'(ఎన్‌హెచ్‌సీ) అంగీకరించింది. అప్పటికి సార్స్ కోవ్2ను గుర్తించకపోవడం వల్ల ఆ నమూనాల కారణంగా వైరస్ మరింత మందికి వ్యాపించకుండా ఈ నిర్ణయం తీసుకొన్నామని వివరించింది. విషయాన్ని ఎన్‌హెచ్‌సీలోని సైన్స్ అండ్ హెల్త్ విభాగానికి చెందిన ల్యూ డెంగ్‌ఫెంగ్ ప్రకటించారు.
కేవలం అనుమతుల్లేని ప్రయోగశాలల్లోని నమూనాలనే ధ్వంసం చేయాలని పేర్కొన్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని అమెరికా అధికారులు వక్రీకరించి గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు. గుర్తుతెలియని న్యుమోనియా వ్యాపించగానే కారణాలను గుర్తించేందుకు జాతీయ స్థాయి పరిశోధనశాలలు రంగంలోకి దిగాయని వెల్లడించారు. ఈ క్రమంలో పూర్తివిషయాలు వెల్లడయ్యేదాకా ఆ వైరస్‌ను అడ్డుకొనేందుకు 'క్లాస్-2' వ్యాధికారకంగా దానిని వర్గీకరించామన్నారు.