చైనా మరింత బరి తెగించింది. గాల్వన్ వ్యాలీ భూభాగంపై సార్వభౌమాధికారం తమదేనని ప్రకటించింది. భారత సైన్యం తమ భూభాగంలోకి చొచ్చుకొస్తోందని బుకాయించింది. తమ సైన్యాన్ని అదుపులో పెట్టుకోవాలని భారత్‌ను కోరుతున్నామంది. సరిహద్దుపై వివాదాలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని పేర్కొంది. చైనా భూభాగంలోనే ఘర్షణ జరిగిందని.. ఇందుకు తమను బాధ్యులను చేయొద్దని వ్యాఖ్యానించింది. సమస్యను పరిష్కరించేందుకు దౌత్య, సైన్యాధికారుల స్థాయిలో భారత్‌తో మాట్లాడుతున్నట్లు చెప్పింది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియాన్ ప్రకటన విడుదల చేశారు.
ఇక చాలు...
సరిహద్దులో మరోసారి ఘర్షణలు జరగాలని తాము కోరుకోవడం లేదని తెలిపారు లియాజన్. నాయకుల మధ్య కుదిరిన ఏకాభిప్రాయాన్ని రెండు దేశాలు కచ్చితంగా పాటించాలని సూచించారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు యథావిధిగా కొనసాగేలా చూడాలన్నారు.