ఇండో-చైనా సరిహద్దులో బలగాల మోహరింపును సమర్థించుకునే ప్రయత్నం చేసింది చైనా. వాస్తవాధీన రేఖ వెంబడి తమ బలగాలు సాధారణ గస్తీ మాత్రమే నిర్వహించాయని పేర్కొంది. తమ సైన్యం శాంతి, సామరస్యతను కోరుకుంటున్నాయని చెప్పుకొచ్చారు ఆ దేశ విదేశాంగశాఖ ప్రతినిధి జావో లిజియాంగ్.
లద్దాఖ్‌లోని పాంగోంగ్ త్సో సరస్సు ప్రాంతంలో.. భారత్- చైనా బలగాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు లిజియాంగ్.
సరిహద్దు సమస్యపై చైనా వైఖరి స్థిరంగా, స్పష్టంగా ఉంది. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, సామరస్యతను చైనా బలగాలు కోరుకుంటున్నాయి. చైనా వైపు వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి మా బలగాలు సాధారణ పాట్రోలింగ్ నిర్వహించాయి. చైనాతో కలిసి పనిచేయాలని భారత్‌ను కోరుతున్నాం. దౌత్య సంబంధాల బలోపేతం, సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వంపై ప్రభావం పడేలా భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని విజ్ఞప్తి చేస్తున్నాం. సరిహద్దు సమస్యపై ఇరు దేశాలు దౌత్యపరంగా చర్చించుకోవాలి.