తెలంగాణ

telangana

ETV Bharat / international

భారత్​, అమెరికా లక్ష్యంగానే చైనా 'వేడుకలు'! - సైన్యం

"సామ్యవాద చైనా... ఈ రోజు ప్రపంచం ముందు సగర్వంగా నిలబడింది. ఈ మహోన్నత దేశ పునాదులను కదపడం ఎవరి తరం కాదు".... చైనా 70వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆ దేశాధ్యక్షుడు షీ జిన్​పింగ్​ వ్యాఖ్యలివి. దేశభక్తిని ఉప్పొంగించేందుకు చేసిన సాదాసీదా వ్యాఖ్యలుగా వీటిని పరిగణించవచ్చా...? జిన్​పింగ్​ ఏం చెప్పదలిచారు? ఆయుధ ప్రదర్శనతో డ్రాగన్​ దేశం ఇచ్చిన సందేశమేంటి..?

భారత్​, అమెరికా లక్ష్యంగానే చైనా 'వేడుకలు'!

By

Published : Oct 3, 2019, 8:01 PM IST

రిపబ్లిక్​ ఆఫ్​ చైనా 70వ ఆవిర్భావ వేడుకలు బీజింగ్​ తియానన్మెన్ స్క్వేర్​లో ఘనంగా సాగాయి. ఆవిర్భావ వేడుకలలో నిర్వహించిన పరేడ్​లో అత్యాధునిక, శక్తిమంతమైన ఆయుధాలను ప్రదర్శించి... సైనిక బలాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది డ్రాగన్​ దేశం.
ఆవిర్భావ పరేడ్

ఆవిర్భావ పరేడ్​లో పెద్ద ఎత్తున చైనా సైన్యం పాలుపంచుకుంది. దాదాపు 15,000 మంది సైనికులు, 160కి పైగా యుద్ధ విమానాలు, 580 నవీన ఆయుధాలను తియానన్మెన్​ స్క్వేర్​లో జరిగిన పరేడ్​లో ప్రదర్శించారు. సైనికపరంగా ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన అమెరికాకు దీటుగా చైనా ఎదుగుదలను ఈ ఆవిర్భావ వేడుకలు ప్రస్ఫుటం చేస్తున్నాయి.పరేడ్​లో భాగంగా చైనా ప్రదర్శించిన కొన్ని ఆయుధాలు... ఆధునిక యుద్ధ రీతిలో అత్యుత్తమమైనవి.

డీఎఫ్​-17: ఇది ప్రత్యేకం

వందలకొద్దీ ఆయుధాలను ఆవిర్భావ వేడుకలో చైనా ప్రదర్శించినా... ఓ ప్రత్యేకమైన అస్త్రం మాత్రం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అదే డీఎఫ్​-17 హైపర్ సోనిక్ గ్లైడ్ క్షిపణి. శబ్దం కంటే ఐదు రెట్లు అధిక వేగంతో శత్రుదేశాల మీదకు వార్​హెడ్​లు మోసుకుపోయే సామర్థ్యం ఈ క్షిపణి సొంతం. ఈ క్షిపణి రాకతో చైనా సైనిక సామర్థ్యం మరింత పెరిగింది. ఈ విషయంలో అమెరికాతో పోలిస్తే చైనా ఓ మెట్టు పైనే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు ఇలాంటి క్షిపణిని అడ్డుకునే వ్యవస్థ ఏ ఇతర దేశం వద్ద లేకపోవడం గమనార్హం.

డీఎఫ్​-17 క్షిపణికి సంప్రదాయ వార్​హెడ్​లతో పాటు అణ్వస్త్రాలు మోసుకెళ్లే సామర్థ్యం ఉంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఉన్న అమెరికా సహా అగ్రరాజ్య మిత్రదేశాలకు ఇది మింగుడుపడని విషయం. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న అమెరికా యుద్ధ నౌకలు, సేనలను ఇది కలవరపెట్టే అంశం.

ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి

ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన డీఎఫ్​-41 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని చైనా ప్రదర్శించింది. ఈ క్షిపణి ఒకేసారి 10 అణు వార్​హెడ్​లు మోసుకెళ్లగలదు. రష్యాకు చెందిన ఎస్​ఎస్​-18 సతాన్ క్షిపణి కన్నా ఇది ఎంతో మెరుగైనది. చైనా ప్రదర్శించిన ఆయుధాల్లో.... గోంగ్జీ-11 డ్రోన్ ప్రత్యేకమైంది​. ఈ డ్రోన్ ఇతరుల కంట పడకుండా రహస్యంగా లక్ష్యాలను గుర్తించి మట్టుబెట్టగలదు. ఈశాన్య సరిహద్దులో చైనా నుంచి భారత్ ఎదుర్కొంటున్న సవాళ్లకు ఇది అదనం.సూపర్​సోనిక్ వేగంతో కూడిన నిఘా డ్రోన్ డీఆర్​-8​ను చైనా ప్రదర్శించింది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ త్రివిధ దళాలలో విధులు నిర్వహించగలగటం ఈ క్షిపణి ప్రత్యేకత. శత్రుదేశాల సైన్యాలను గుర్తించి, డీఎఫ్​-17, షార్ప్​ స్వార్డ్ వంటి వ్యవస్థలకు వాటి సమాచారాన్ని అందించి, సైన్యాన్ని అప్రమత్తం చేస్తుంది డీఆర్​-8. పెద్ద సంఖ్యలో యుద్ధ ట్యాంకులు, జే-20 స్టెల్త్ ఫైటర్, హెచ్​-6ఎన్​ స్ట్రాటజిక్ బాంబర్, వైజే-18 సూపర్ సోనిక్ యాంటీ షిప్ క్రూయిజ్ మిస్సైల్, డీఎఫ్​-26 యాంటీ షిప్ మధ్య శ్రేణి బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థలను ఈ పరేడ్​లో చైనా ప్రదర్శించింది. ఇండో పసిఫిక్ తీరంలో అమెరికా, మిత్రపక్షాల జోక్యాన్ని తగ్గించడం సహా ప్రాంతీయ సవాళ్లను దృష్టిలో ఉంచుకొని ఈ అధునాతన సూపర్​సోనిక్ డ్రోన్లు, హైపర్​సోనిక్ గ్లైడ్ వాహనాలు, వైమానిక ఆయుధాలు, క్షిపణి వ్యవస్థలను చైనా రూపొందించినట్లు కనిపిస్తోంది.
అసలు లక్ష్యం వేరే...!
దేశ శక్తిసామర్థ్యాలను చాటిచెప్పి, శత్రుదేశాలకు గట్టి హెచ్చరికలు జారీ చేయడానికే చైనా ఈ పరేడ్​ను ఉపయోగించుకుంది. తైవాన్ నుంచి దక్షిణ చైనా సముద్రం తీర ప్రాంతాల వరకు, భారతదేశానికి ఈశాన్య భాగాన ఉన్న మెక్​మోహన్ రేఖ వరకు తన హెచ్చరిక స్వరాన్ని గట్టిగా వినిపించింది. అధ్యక్షుడు జిన్​పింగ్​ మాటలు, తియానన్మెన్ స్క్వేర్​లో జరిగిన పరేడ్​ను గమనిస్తే ఇది అర్థమవుతోంది.

"ఈ మహోన్నత దేశ పునాదులను కదపడం ఎవరి తరం కాదు. ఈరోజు సామ్యవాద చైనా ప్రపంచం ముందు సగర్వంగా నిలబడింది. దేశ సమగ్రత, భద్రత, ప్రయోజనాలు, ప్రపంచ శాంతిని చైనా సైన్యం కాపాడుతుంది."
-షీ జిన్​పింగ్​, చైనా అధ్యక్షుడు


అగ్రరాజ్యంతో సై...
ఎప్పటినుంచో అగ్రరాజ్యమైన అమెరికాకు పోటీ ఇవ్వడమే లక్ష్యంగా చైనా తన ప్రతి కార్యక్రమాన్ని చేపడుతోంది. ఆర్థికంగానే కాక సైన్య పరపతి విషయంలోనూ ప్రపంచానికి పెద్దన్న పాత్ర పోషించాలని డ్రాగన్​ పరితపిస్తోంది. ఇందుకోసం ఆయుధ సంపత్తి పెంచుకోవడం ప్రారంభించింది. ఇందులో భాగంగా చైనా తన పీపుల్స్​ లిబరేషన్ ఆర్మీ ఆధునికీకరణను 1990లో మొదలుపెట్టింది. 2035 కల్లా ప్రపంచంలో తిరుగులేని ఆయుధ సంపత్తి కలిగిన దేశంగా ఆవిర్భవించేలా ముందుకు సాగుతోంది.సైనికపరంగా ముందు ఉండేందుకు చైనా ఎప్పటికప్పుడు యుద్ధతంత్రాలను మార్చుకుంటూ వస్తోంది. పరిస్థితులకు తగ్గట్లుగా వ్యూహాలకు సానబెడుతోంది.


"అత్యున్నత సాంకేతికత సాయంతో స్థానిక యుద్ధాలు"... 90వ దశకంలో చైనా యుద్ధ వ్యూహమిది. దీనిని 2014లో "సమాచార సమ్మిళిత ఉమ్మడి ఆపరేషన్"​గా మార్చింది. ఇప్పుడు యుద్ధతంత్రంలో మరింత రాటుతేలింది. వ్యూహాలను కాగితాలకే పరిమితం చేయకుండా... వాస్తవ రూపంలోకి తెచ్చింది. లోపాల్ని సరిదిద్దుకుంది. తన వద్ద అందుబాటులో ఉన్న వ్యవస్థలన్నింటినీ కలిపి సద్వినియోగం చేసుకుంటూ... శత్రు దేశల ఆయుధ వ్యవస్థలను ధ్వంసం చేయడమే ప్రస్తుత యుద్ధవ్యూహంగా మార్చుకుంది.

భారత్​కు హెచ్చరిక...

చైనా చర్యలు భారత్​కూ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. భౌగోళికంగా సరిహద్దు పంచుకుంటున్న భారత్​కు శక్తిమంతంగా మారిన చైనాను నిలువరించడం కత్తిమీద సామే.

ఒకే కొండపై రెండు పులులు ఉండవన్న చైనా నానుడి ప్రకారం ఒకే ప్రాంతంలో రెండు దేశాలు పెత్తనం సాగించడం చాలా క్లిష్టతరమైన విషయం. ఆసియాలో తిరుగులేని శక్తిగా ఆవిర్భవించడానికి చైనాకు ఉన్న ఏకైక పెద్ద అవరోధం భారత్​. చైనాతో పోల్చితే ఆర్థికంగా, సైనికపరంగా ఎంతో వెనుకబడి ఉన్నప్పటికీ... భారత్​ ప్రస్తుతం ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోంది. అందువల్ల ఎప్పటికైనా చైనాకు పక్కలో బల్లెంలా మారే అవకాశం ఉంది. అందుకే ఇలాంటి వ్యూహాలు, ప్రదర్శనలతో ఎప్పటికప్పుడు పైచేయి సాధించే ప్రయత్నం చేస్తోంది డ్రాగన్.

చైనా ఏ2ఏడీ వంటి వ్యవస్థలకు దీటుగా అమెరికా తక్షణమే రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడం అవసరం. రక్షణ రంగ సామర్థ్యాలను వేగంగా పెంపొందించుకుని, చైనాను ఎదుర్కోవడం ఇప్పుడు భారత్​కు​ ఎంతో ముఖ్యం.ఇప్పటికిప్పుడే రక్షణ సామర్థ్యాన్ని బలపరుచుకోవడం ఇరుగుపొరుగు దేశాలకు పెద్ద సవాలు. చైనా పెత్తనాలకు తలొగ్గక డోక్లాం ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు ఎదురొడ్డి నిలిచిన భారత్​కూ ఇది సమస్యే.

తియానన్మెన్ స్క్వేర్​లో జరిగిన చైనా 70వ ఆవిర్భావ వేడుకలు అమెరికా, భారత్​కు మాత్రమే కాక పొరుగు దేశాలైన జపాన్, తైవాన్, దక్షిణ కొరియా, వియత్నాం వంటి దేశాలకు ఓ హెచ్చరిక. ఈ దేశాలన్నీ ఐక్యంగా చైనాను నిలువరించాల్సిన అవసరాన్ని గుర్తుచేసిన మరో సందర్భం.
(రచయిత- కల్నల్ ధన్​వీర్​ సింగ్​, రక్షణ రంగ నిపుణులు)

ABOUT THE AUTHOR

...view details