ఓవైపు భారత్‌తో శాంతి మంత్రం పఠిస్తూనే దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది చైనా. లద్దాఖ్‌లో సైనిక ప్రతిష్టంభన(Ladakh Standoff) కొనసాగుతున్నప్పటికీ.. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)కి సమీపంలో శాశ్వత శిబిరాలను నిర్మిస్తోంది డ్రాగన్ సైన్యం(China Army). ఈ నిర్మాణాల ద్వారా వివాదాస్పద ప్రాంతాలను ఆ దేశ సైన్యం అత్యంత తక్కువ సమయంలోనే చేరుకునే వీలు కలగనుంది.
సిక్కింలోని నకులా ప్రాంతానికి సమీపంలో కొన్ని కిలోమీటర్ల దూరంలోనే చైనా భూభాగంలో అలాంటి ఓ క్యాంప్ నిర్మించినట్లు ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. గత ఏడాది ఇరు దేశాల సైనికులు ఘర్షణకు దిగిన ప్రాంతానికి కొన్ని క్షణాల్లో చేరుకునేంత దూరంలోనే ఈ నిర్మాణాలు ఉన్నాయని చెప్పారు.
"సరిహద్దు ప్రాంతాలకు వేగంగా సైనికులను తరలించేందుకు వీలుగా చైనా శాశ్వత కాంక్రీట్ శిబిరాలను నిర్మిస్తోంది. రోడ్డు సౌకర్యాలు సైతం మెరుగ్గా ఉన్నాయి. దాంతో గతంలో కంటే వేగంగా బలగాలను చేరవేసేందుకు వీలు కలుగుతుంది. "
- సీనియర్ అధికారి