దాదాపు 50ఏళ్ల తర్వాత జాబిల్లిపై మరో దేశ జెండా రెపరెపలాడింది. చంద్రుడి ఉపరితలంపై నమూనాలను సేకరించడానికి వెళ్లిన చైనా వ్యోమనౌక అక్కడ తమ జాతీయజెండాను ఎగురవేసింది. ఇందుకు సంబంధించిన చిత్రాలను చాంగే-5 మానవ రహిత వ్యోమనౌక తన కెమెరాలో బంధించింది. 2 మీటర్ల వెడల్పు, 90 సెంటీమీటర్ల పొడవు ఉన్న ఈ జెండా ఫొటోలను చైనా జాతీయ అంతరిక్ష కేంద్రం విడుదల చేసింది. చంద్రుడి మట్టిని సేకరించి తిరిగి భూమికి బయల్దేరే ముందు చాంగే-5 డ్రాగన్ జెండాను జాబిల్లి ఉపరితలంపై పాతింది.
జాబిల్లి ఉపరితలం నమూనాలను సేకరించి, భూమికి రప్పించేందుకు చైనా గత మంగళవారం సంక్లిష్ట అంతరిక్ష ప్రయోగాన్ని చేపట్టింది. చాంగే-5 వ్యోమనౌకను విజయవంతంగా కక్ష్యలోకి పంపింది. వెంచాంగ్ రోదసి కేంద్రం నుంచి లాంగ్ మార్చ్-5 రాకెట్ ద్వారా డ్రాగన్ ఈ ప్రయోగాన్ని చేపట్టింది. 8 టన్నుల బరువున్న చాంగే-5లో ఆర్బిటర్, ల్యాండర్, అసెండర్, రిటర్నర్ అనే నాలుగు స్వతంత్ర భాగాలున్నాయి. ఈ వ్యోమనౌక చంద్రుడి నమూనాలను తీసుకుని గురువారం మధ్యాహ్నం తిరిగి భూమికి బయల్దేరినట్లు చైనా అంతరిక్ష సంస్థ వెల్లడించింది.
50 ఏళ్ల తర్వాత జెండా..
జాబిల్లి నుంచి నమూనాలను తెచ్చేందుకు మానవాళి యత్నించడం గత 40ఏళ్లలో ఇదే తొలిసారి. అంతకుముందు అమెరికా చంద్రుడి నమూనాలను తెచ్చేందుకు వ్యోమగాములను పంపింది. 1969లో చేపట్టిన ఆ ప్రయోగంతోనే తొలిసారిగా మానవుడు చంద్రుడిపై కాలుమోపాడు. జాబిల్లిపై దిగిన నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ అమెరికా జెండాను ఎగురవేశారు. ఆ తర్వాత చందమామపై మరో దేశ జెండగా ఎగిరింది ఇప్పుడే కావడం విశేషం. ఇక అమెరికా తర్వాత సోవియట్ యూనియన్ మాత్రం మానవరహిత వ్యోమనౌకలను ప్రయోగించింది. అమెరికా, సోవియట్ యూనియన్ పంపిన వ్యోమనౌకలు చంద్రుడిపై శాంపిళ్లను సేకరించి విజయవంతంగా భూమిని చేరుకున్నాయి. ఇప్పుడు చాంగే-5 క్షేమంగా భూమికి తిరిగొస్తే ఈ ఘనత సాధించిన మూడో దేశంగా చైనా నిలుస్తుంది.