పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరుదేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణకు, చర్చల ద్వారా సమస్య పరిష్కరించే ప్రయత్నాలకు చైనా మద్దతు ఇచ్చిందని పేర్కొన్నారు ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ. ఈ విషయంలో తెరవెనుక నుంచి బీజింగ్ చేపట్టిన చర్యలను నొక్కి చెప్పారు.
చైనా 2019 దౌత్య విజయాలపై అధికార కమ్యూనిస్ట్ పార్టీ వార్తాసంస్థ పీపుల్స్ డెయిలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పుల్వామా అనంతరం భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు బీజింగ్ చేసిన కృషిని ప్రస్తావించారు వాంగ్.
"భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్తతను తగ్గించే ప్రయత్నాలకు చైనా మద్దతు పలికింది. ఇరు దేశాల మధ్య వ్యత్యాసాలను చర్చల ద్వారా పరిష్కరించేందుకు కృషి చేశాం. ఈ ఏడాది పోరుగు దేశాలతో దౌత్య విషయంలో చాలా ముఖ్యాంశాలు ఉన్నాయి. మొదటగా పొరుగు దేశాలతో అన్ని విధాలుగా సంబంధాల బలోపేతం చేపట్టాం. చెన్నైలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ల మధ్య రెండో సమావేశం విజయవంతమైంది. భారత్-చైనా సంబంధాల బలోపేతంపై చర్చించారు. పరస్పర సహకారంపై పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు."