అమెరికా.. తమపై విధించిన వాణిజ్యపరమైన ఆంక్షలను తొలగించాలని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ సోమవారం తెలిపారు. అంతేకాకుండా తమ అధీనంలోని తైవాన్, హాంకాంగ్, షింజియాంగ్, టిబెట్లో అనవసర జోక్యాన్ని వీడాలని కోరారు. అక్కడి వేర్పాటువాద శక్తులకు అమెరికా మద్దతు ఇవ్వడం ఆపాలన్నారు. ఇరుదేశాల సంబంధాలపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని బైడెన్ ప్రభుత్వంపై జిన్పింగ్ ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో ఈ విధంగా స్పందించారు వాంగ్ యీ.
"అమెరికా నూతన పాలనా యంత్రాంగం.. విదేశాంగ విధానాన్ని సమీక్షిస్తుందని భావిస్తున్నాం. ఈ విషయంలో బైడెన్ సర్కార్ వేగంగా స్పందించడం సహా.. పక్షపాత ధోరణిని వీడి, అన్ని దేశాలను ఒకేలా చూస్తుందని మేం ఆశిస్తున్నాం. అనవసరమైన కలహాలను వదిలేసి, ఇరుదేశాల అభివృద్ధి కోసం సత్సంబంధాలను కొనసాగించాలని కోరుతున్నాం. చైనా-అమెరికా అనే భారీ ఓడను నడిపించేందుకు ఇరుపక్షాలు కలిసి పనిచేస్తాయని విశ్వసిస్తున్నాం."