కరోనా వైరస్ విషయంలో అమెరికా చేస్తోన్న ఆరోపణలపై చైనా ప్రతిదాడికి దిగింది. వుహాన్ ల్యాబ్‌లో వైరస్ తయారుచేసినట్లు ఆధారాలు చూపెట్టాలని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియోకు సవాల్ విసిరింది.
"వుహాన్ ల్యాబ్ నుంచి కరోనా వైరస్ లీకయినట్లు తమ వద్ద ఆధారాలున్నాయని పాంపియో అన్నారు. అలాంటప్పుడు అవి మాకు చూపెట్టండి. ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగిందో చెప్పాలి. కానీ ఆయన చూపెట్టలేరు. ఎందుకంటే ఆయన వద్ద ఏమీ లేవు. శాస్త్రవేత్తలు, నిపుణులకు సంబంధించిన విషయంలో రాజకీయ నాయకులు కలగజేసుకోకూడదు."
- హూయా చున్యింగ్, చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కూడా ఇదే చెప్పిందని చున్యింగ్ గుర్తుచేశారు. వుహాన్ ల్యాబ్‌కు సంబంధించి ఎటువంటి ఆధారాలు అమెరికా చూపెట్టలేదని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అన్నారని తెలిపారు. అమెరికాలోని శాస్త్రవేత్తలు కూడా ప్రకృతిలోనే వైరస్ పుట్టిందని చెబుతున్నారని గుర్తు చేశారు.
"అమెరికాలో గతేడాది అక్టోబర్‌లోనే కరోనా వైరస్ కేసు నమోదైనట్లు నివేదికలు చెబుతున్నాయి. ఫ్రాన్స్ నుంచి వచ్చిన నివేదిక ప్రకారం గతేడాది డిసెంబర్లోనే వైరస్ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో అన్ని దేశాలు 2019లో నమోదైన కేసులను తిరిగి పరిశీలించాలి.