కశ్మీర్ అంశంలో భారత్‌పై చైనా మరోసారి తన అక్కసు వెళ్లగక్కింది. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేకాధికారాలు కల్పించే ఆర్టికల్ 370 రద్దు తమ అంతర్గత వ్యవహారమని భారత్ ప్రకటించినా వక్రబుద్ధిని చాటుకుంది చైనా. ఈ అంశంపై ఐరాస భద్రతామండలిలో చర్చ జరగాలన్న పాకిస్థాన్ డిమాండ్‌కు డ్రాగన్ మద్దతు తెలిపింది.
ఈ మేరకు భద్రతామండలి అధ్యక్షుడిగా ఉన్న పోలాండ్ రాయబారికి చైనా ఇటీవల లేఖ రాసినట్లు ఐరాస రాయబారి తెలిపారు. అయితే ఇంకా తేదీ, సమయం ఖరారు చేయలేదని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దుపై ఐరాసకు పాకిస్థాన్ రాసిన లేఖను ప్రస్తావించింది డ్రాగన్. ఆ విషయాన్ని భద్రతామండలి అజెండా ఐటంగా చేర్చాలని కోరినట్లు ఐరాస రాయబారి తెలిపారు.
చర్చ తేదీ, సమయం నిర్ణయించటానికి ముందు మండలిలోని ఇతర సభ్యదేశాలను సంప్రదించాల్సి ఉంటుందని ఐరాస రాయబారి చెప్పారు. ఈ అంశంపై రేపు చర్చ జరిగేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు.