కరోనా పుట్టినిల్లు చైనాలో నకిలీ కరోనా నిరోధక టీకాలను సరఫరా చేస్తున్న 80 మందిని పోలీసులు అరెస్టు చేశారు. కొన్ని నకిలీ టీకాలు ఇప్పటికే ఆఫ్రికా చేరినట్లు అధికారులు వెల్లడించారు. కరోనా వ్యాక్సిన్లకు సంబంధించిన నేరాలను అరికట్టేందుకు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో 80 మందిని అరెస్టు చేశారని, 3 వేల మోతాదుల నకిలీ వ్యాక్సిన్‌లను స్వాధీనం చేసుకున్నారని చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ తెలిపింది. బీజింగ్, జియాంగ్జు, షాన్డాంగ్ ప్రాంతాల్లో పోలీసులు ఈ దాడులు చేశారు.
గతేడాది సెప్టెంబర్ నుంచి నకిలీ వ్యాక్సిన్లు తయారు చేసి వాటిని అధిక ధరలకు విక్రయిస్తూ నిందితులు లాభం పొందుతున్నారని అధికారులు తెలిపారు. నకిలీ కరోనా టీకాలను అక్రమంగా ఆఫ్రికాకు రవాణా చేసినట్లు వెల్లడించారు. అయితే ఈ టీకాలను దేశం ఎలా దాటించారనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి నేర కార్యకలాపాలు నివారించేందుకు ఇతర దేశాల సహకారం అవసరమని చైనా విదేశాంగ శాఖ విజ్ఞప్తి చేసింది.