ప్రాణాంతక కరోనా వైరస్‌పై యుద్ధానికి ముమ్మర చర్యలు చేపట్టింది చైనా. శరవేగంగా ఆసుపత్రులను నిర్మిస్తున్న డ్రాగన్ దేశం... తాజాగా వైరస్‌ను నిరోధించేందుకు దాదాపు 4 మిలియన్ డాలర్ల నిధులను కేటాయించింది. పనులకు ఆటంకం కలగకుండా.. ఈ నిధులను సక్రమంగా వినియోగించాలని ఆదేశాలు జారీ చేసింది.
వుహాన్ కేంద్రబిందువుగా విజృంభిస్తున్న ఈ మహమ్మారి వల్ల ఇప్పటికే 170మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనాకు సంబంధించి 7వేలకుపైగా కేసులు నమోదయ్యాయి.
విరాళాలతో ముందుకు..
గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న చైనాకు దిగ్గజ వ్యాపారవేత్తలు అండగా నిలుస్తున్నారు. డ్రాగన్ దేశంలోనే రెండో అత్యంత ధనికుడు, అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా.. ప్రభుత్వానికి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. దాదాపు 14మిలియన్ డాలర్ల విరాళాలు అందించనున్నట్టు తెలిపారు. టీకాను అభివృద్ధి చేసేందుకు తన సంస్థలు కృషి చేయనున్నట్టు స్పష్టం చేశారు.
ప్రాణాంతక వైరస్‌తో పోరులో భాగంగా 10 మిలియన్ డాలర్లను చైనా, ఆఫ్రికా దేశాలకు అందించనున్నట్టు గేట్స్ ఫౌండేషన్ ప్రకటించింది.