చైనా సరిహద్దు నగరం రూలీలో కరోనా విజృంభిస్తోంది. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం మహమ్మారిని నిలువరించేందుకు మొత్తం నగర జనాభా 3,00,000 మందికి టీకా పంపిణీ చేయాలని నిర్ణయించింది. లక్షా 59వేల టీకా డోసులు నగరానికి చేరుకున్నట్లు చైనా మీడియా 'సీసీటీవీ' పేర్కొంది. ఐదు రోజుల పాటు నిర్వహించనున్న ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం శుక్రవారం నుంచి మొదలైంది. ప్రజలు లైన్లలో నిలబడి టీకాలు తీసుకుంటున్న దృశ్యాలను చైనా మీడియా ప్రసారం చేసింది.
ఈ నగరంలో కొత్తగా 16 కేసులు వెలుగుచూశాయి. వారిలో పన్నెండు మంది చైనా పౌరులు కాగా.. మిగతా నలుగురు సరిహద్దు దేశం మయన్మార్ జాతీయులు.
మయన్మార్ సరిహద్దుల నుంచి అక్రమంగా నగరంలోకి ప్రవేశించే వారిని అడ్డుకునేందుకు కఠిన నిబంధనలను రూపొందించనున్నట్లు నగర అధికారులు పేర్కొన్నారు. అలాగే నగర ప్రజలందరూ హోం క్వారంటైన్లోనే ఉండాలని ఆదేశించారు. అత్యవసరమైన వ్యాపారాలను మాత్రమే తెరచి ఉంచేందుకు అనుమతించారు.