వాహనాన్ని వేగంగా నడిపి ప్రమాదాలకు కారణమై పలాయనం చిత్తగించే వారి సంఖ్య కోకొల్లలు. మనిషి బతికాడా చచ్చాడా అని కూడా పట్టించుకోరు చాలామంది. కానీ మిజోరంకు చెందిన ఓ పిల్లాడు.. చిన్న కోడిపిల్ల ప్రాణం కోసం పడిన ఆరాటం అందరిని ఆశ్చర్యపరుస్తోంది.
'డాక్టర్... ఈ కోడిపిల్లకు హెల్ప్ చేయండి' - దయ
మిజోరం రాష్ట్రంలోని సైరాంగ్‌కు చెందిన ఓ బాలుడి కరుణా హృదయానికి సామాజిక మాధ్యమాల్లో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సైకిల్ కింద పడిన కోడిపిల్ల ప్రాణం కోసం పిల్లాడు పడిన ఆరాటం అందరిని ఆశ్చర్యపరుస్తోంది.
మిజోరం సైరాంగ్కి చెందిన ఓ పిల్లాడు సైకిల్‌పై వెళ్తుండగా ఓ చిన్న కోడిపిల్ల అడ్డువచ్చింది. పొరపాటున సైకిల్ కింద పడింది. వెంటనే ఆ కోడిపిల్లను తీసుకుని సమీపంలోని ఆసుపత్రికెళ్లాడు బాలుడు. ఎలాగైనా కాపాడండి అంటూ జేబులోని డబ్బు తీసి వైద్యుడికివ్వబోయాడు. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
పిల్లాడి అమాయకత్వపు మాటలకు ముందు నవ్వుకున్నా... తర్వాత చిన్న వయసులోనే బాలుడికున్న జాలి హృదయాన్ని చూసి అభినందిస్తున్నారు నెటిజన్లు. ఇప్పటికే లక్ష పైగా లైక్‌లు, 76వేల షేర్లు అందుకుందీ ఫొటో. చిన్నతనంలోనే పిల్లాడి సామాజిక బాధ్యతను చూసి విశేషంగా స్పందిస్తున్నారు.