చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా.. అక్కడి అధికారులపై ఆరోపణలు చేసినా.. చైనా అధినాయకుడి ఆగ్రహానికి గురి కావాల్సిందే. ఇలా అక్కడి ప్రభుత్వంపై వ్యతిరేక గళాన్ని వినిపించే వారిని చైనా అణచివేస్తోందనే వాదనలు పెరుగుతున్నాయి. అంతేకాకుండా అసమ్మతిని అణగదొక్కడంలో భాగంగా అలాంటివారి ఆచూకీ లేకుండా చేస్తుందనే ఆరోపణలూ ఉన్నాయి. ఇలా గత కొంతకాలంలో చైనాలో ప్రముఖుల మిస్సింగ్‌లు మిస్టరీగా మారుతున్నాయి. తాజాగా చైనాకు చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి పెంగ్ షువాయి ఆచూకీ కనిపించకుండా పోవడంపైన ఇలాంటి అనుమానాలే వ్యక్తమయ్యాయి. కేవలం పెంగ్ షువాయినే కాకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన జాక్ మా వంటి దిగ్గజ వ్యాపారవేత్తలు, అక్కడి కళాకారులు, సినీనటులు, ఉన్నతాధికారులు, మీడియా అధినేతలతోపాటు ఎంతో మంది ప్రముఖుల ఆచూకీ తెలియకుండా పోతున్నాయనే ప్రపంచ వ్యాప్తంగా నివేదికలు వెల్లడిస్తున్నాయి. వాటిలో కొన్ని మిస్టరీ కేసులపై ఓసారి గమనిస్తే..
అయ్ వీవీ: కళాకారుడు
కళాకారుడు, చిత్ర నిర్మాతైన అయ్ వీవీ చైనా ప్రభుత్వంపై బహిరంగ విమర్శలు చేస్తూ ఓ అసమ్మతివాదిగా ముద్ర వేసుకున్నారు. ముఖ్యంగా అక్కడి ప్రజాస్వామ్యం, భావప్రకటనా స్వేచ్ఛ వంటి అంశాల్లో ఆయన బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తారు. దీంతో 2011లో ఆయనను అరెస్టు చేసిన ప్రభుత్వం.. దాదాపు 81రోజుల పాటు రహస్య ప్రదేశంలో నిర్బంధించింది. అంతేకాకుండా కొన్ని సంవత్సరాల పాటు ఆయన పాస్‌పోర్టును నిలిపివేసింది. చైనాలో ఆచూకీ లేకుండా చేయడం ఎలా ఉంటుందో అని ప్రపంచానికి చాటిచెప్పిన అతికొద్ది మంది సెలబ్రిటీల్లో వీవీ ఒకరనే చెప్పవచ్చు. 2015లో చైనా నుంచి బయటకు వచ్చిన వీవీ.. అక్కడి జైలు జీవితాన్ని కళ్లకు కట్టినట్లు వివరించారు. ముఖ్యంగా తినడం నుంచి నిద్రపోయేవరకు, స్నానం నుంచి మలవిసర్జన వరకూ ప్రతి నిమిషాన్ని అక్కడి గార్డులు ఎలా పర్యవేక్షించేవారో చెప్పుకొచ్చారు.
ఝావో వీ: నటి
పాశ్చాత్య సంప్రదాయం వల్లే తమ యువత పెడదారి పడుతోందని భావిస్తోన్న చైనా ప్రభుత్వం.. అక్కడి సెలబ్రిటీలపైనా కన్నేసింది. ముఖ్యంగా పాప్ కల్చర్ కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాల నుంచి అక్కడి యువతను దూరం చేస్తున్నట్లు ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది ఆగస్టు నెలలో అక్కడి ప్రముఖ పాప్ సింగర్ ఝావో కనిపించకుండా పోయారు. ఆమెకు చెందిన సమాచారం కూడా ఇంటర్నెట్ నుంచి అదృశ్యమయ్యింది. వీటికితోడు ఆమె సినిమాలు, టీవీ షోలు కూడా ఆన్‌లైన్ వేదికల నుంచి తొలగించబడ్డాయి. ఆ సమయంలో ఆమె కనిపించకుండా పోవడం మరోసారి చర్చనీయాంశమయ్యింది. కానీ, నెల రోజుల తర్వాత ఆమె స్వగ్రామంలో కనిపించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఆమె గృహ నిర్బంధంలో ఉన్నారా..? అనే విషయంపైనా స్పష్టత లేదు. తాజాగా ఓ ఆన్‌లైన్ షాపింగ్ కార్యక్రమంలో కనిపించినట్లు చైనాలోని ఓ ఇంటర్నెట్ పోర్టల్ వెల్లడించింది. కానీ, ఝావోపై అధికారిక సమాచారం మాత్రం ఇప్పటికీ తెలియదు.
మెంగ్ హాంగ్వే : ఇంటర్‌పోల్ చీఫ్
చైనాకు చెందిన మెంగ్ హాంగ్వే 2016లో ప్రపంచ వ్యాప్తంగా పోలీసులకు సహకారం అందించే ‘ఇంటర్‌పోల్’ విభాగానికి చీఫ్‌గా ఎన్నికయ్యారు. అంతకుముందు చైనాలో ప్రజాభద్రతా విభాగానికి ఇంఛార్జిగా ఉన్న మెంగ్ హాంగ్వే.. 2018లో అదృశ్యం కావడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చైనాకు బయలుదేరినట్లు తన కుటుంబ సభ్యులకు చెప్పిన తర్వాత ఆయన ఆచూకీ లేకుండా పోయింది. దీనిపై ఆయన భార్య గ్రేస్ మెంగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఫ్రాన్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అలా మిస్టరీగా మారిన హాంగ్వేను ఓ కేసులో ప్రశ్నించడం కోసం చైనాకు తీసుకెళ్లినట్లుగా ది సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఓ కథనంలో పేర్కొంది. లంచాలు స్వీకరిస్తున్నారనే ఆరోపణలపై 2020లో మెంగ్‌ను అరెస్టు చేసినట్లు చైనా ప్రభుత్వం ధ్రువీకరించింది. ఆ కేసులో ఆయనకు 13ఏళ్ల శిక్షపడినట్లు పేర్కొంది. దీంతో కిడ్నాపర్ల నుంచి ముప్పు పొంచివుందన్న ఆందోళన నేపథ్యంలో ఆయన భార్య గ్రేస్‌తో పాటు ఇద్దరు పిల్లలకు ఫ్రాన్స్ ఆశ్రయం కల్పించింది. ఈ మధ్యే తొలిసారి మీడియా ముందుకు వచ్చిన గ్రేస్ మెంగ్.. తన భర్త ఆచూకీ ఇప్పటికీ లభించలేదని వాపోయారు.
ఇదీ చదవండి:అగ్ర స్థానం నుంచి 'మా'యం!