లాక్డౌన్ ఎత్తివేసి ఆర్థిక వ్యవస్థను ఆదుకోవాలని చూస్తున్న దేశాలకు కరోనా సెగ పెరుగుతోంది. ఓవైపు కరోనాతో సహజీవనం కోసం అధికారులు ప్రణాళికలు రచిస్తుంటే.. వైరస్ మాత్రం తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 58,14,687 కేసులు నమోదయ్యాయి. మొత్తం 3,47,979 మంది ప్రాణాలు కోల్పోయారు.
దేశం | కేసులు | మృతులు |
అమెరికా | 17,46,311 | 1,02,116 |
బ్రెజిల్ | 4,14,661 | 25,697 |
రష్యా | 3,79,051 | 4,142 |
స్పెయిన్ | 2,83,849 | 27,118 |
బ్రిటన్ | 2,67,240 | 37,460 |
ఇటలీ | 2,31,139 | 33,072 |
ఫ్రాన్స్ | 1,82,913 | 28,596 |
జర్మనీ | 1,81,895 | 8,533 |
టర్కీ | 1,59,798 | 4,541 |
రష్యాలో...
రష్యాలో కరోనా ఉద్ధృతి పెరిగింది. కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య 4 వేలు దాటింది. అయినప్పటికీ రష్యావ్యాప్తంగా ఆంక్షల సడలింపునకు శరవేగంగా పనులు జరుగుతున్నాయి. డీలా పడ్డ ఆర్థిక వ్యవస్థను ఎలాగైనా గాడినపెట్టాలని అధికారులు భావిస్తున్నారు.
రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ ఓటమికి చిహ్నంగా మే9న వార్షికోత్సవం జరగాల్సి ఉంది. కరోనా సంక్షోభం దృష్ట్యా ఇది వాయిదా పడింది. తాజాగా.. ఈ 75వ వార్షికోత్సవ వేడుకను జూన్ 24న నిర్వహించనున్నట్టు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. వివిధ దేశాధినేతలకు ఆహ్వానాలు పంపించనున్నట్టు అధికారులు పేర్కొన్నారు.