ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. అందులో చాలా మంది కోలుకున్నారు. అయితే, కోలుకున్నవారికి మళ్లీ కరోనా సోకుతుందా? అనే అనుమానం చాలా మందిలో ఉంది. దీనికి సమాధానం మాత్రం కచ్చితంగా చెప్పలేకపోయినా.. ఇందుకు అవకాశం ఉందని కొన్ని దృష్టాంతాలు స్పష్టం చేస్తున్నాయి.
కొన్ని నెలల క్రితం కరోనా నుంచి కోలుకున్న ఓ 33 ఏళ్ల వ్యక్తికి మళ్లీ సోకినట్లు హాంకాంగ్ పరిశోధకులు గుర్తించారు. అయితే, ఈ పరిశోధన ఏ జర్నల్‌లోనూ ప్రచురితం కాలేదు. కానీ, అతనికి తొలుత వైరస్ సోకినప్పుడు స్వల్ప లక్షణాలు ఉన్నాయనీ, రెండోసారి వచ్చినప్పుడు అసింప్టోమేటిక్ అని తేల్చారు.
అంటే, అతనిలో మొదటిసారి సోకినప్పుడు అభివృద్ధి చెందిన రోగనిరోధక శక్తి.. తీవ్ర అనారోగ్యం నుంచి కాపాడి ఉండవచ్చని భావిస్తున్నారు పరిశోధకులు.
ఇతర దేశాల్లోనూ..
హాంకాంగ్‌లోనే కాకుండా మరికొన్ని దేశాల్లోనూ కొన్ని కేసులు నమోదయ్యాయి. అమెరికాలో ఓ వ్యక్తికి రెండోసారి వైరస్ సోకినప్పుడు మొదటిసారి కన్నా తీవ్ర లక్షణాలు కనిపించాయని తెలుస్తోంది. అయితే, ఇది తరచుగా జరిగే ప్రక్రియ కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.