చైనాలో మీటూ(China MeToo) ఉద్యమాన్ని ముందుండి నడిపించిన జూవో షియావోసువాన్(Zhou Xiaoxuan case) అనే యువతికి అక్కడి న్యాయస్థానంలో చుక్కెదురైంది. లైంగిక ఆరోపణల కేసులో నిందితుడిపై సరైన ఆధారాలు సమర్పించలేకపోయారని న్యాయస్థానం పేర్కొంది. దీంతో ఆరోపణలను కొట్టేసింది.
నేపథ్యమిది...!
చైనా ప్రభుత్వ ఆధీనంలో నడిచే అక్కడి సెంట్రల్ టెలివిజన్ 'సీసీటీవీ'లో.. 2014లో జూవో షియావోసువాన్(25) ట్రైనీగా చేరారు. అక్కడ చేరిన కొద్దిరోజులకే ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ఆ ఛానల్‌లో సీనియర్ యాంకర్‌గా ఉన్న ఓ వ్యక్తి తనపై లైంగిక వేధింపులకు (China MeToo case) పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. మీటూ ఉద్యమంలో చేరిన జూవో తనకు జరిగిన అవమానంపై న్యాయపోరాటం ప్రారంభించారు. బహిరంగ క్షమాపణ చెప్పడమే కాకుండా.. 50వేల యువాన్‌లను నష్టపరిహారం చెల్లించాలని.. జూవో తన దావాలో పేర్కొన్నారు. ఆమె కృషి ఫలించి చివరకు.. ఈ కేసు గతేడాది డిసెంబర్‌లో కోర్టు విచారణకు వచ్చింది.
తొలుత తనపై లైంగిక వేధింపులు జరిగిన తీరును ఆ యువతి సామాజిక మాధ్యమాల్లో వివరించారు. దీనిపై స్పందించిన ఎంతో మంది చైనా మహిళలు.. ఆమెకు మద్దతుగా నిలిచారు. అంతేకాకుండా తమకు ఎదురైన వేధింపుల అనుభవాలను వివరించడం మొదలుపెట్టారు. ఆ సందర్భంలోనే ప్రపంచవ్యాప్తంగా జరిగిన.. మీటూ ఉద్యమం వారిలో మరింత స్ఫూర్తిని నింపింది.