Burj Khalifa Woman Standing: ఓ ఐదంతస్తుల భవనంపైకి ఎక్కి కిందకు చూస్తేనే కళ్లు తిరిగినట్లనిపిస్తుంది. అలాంటిది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా (Burj Khalifa) పైకి ఎక్కడమంటే పెద్ద సాహసమే. అలాంటి క్లిష్టమైన ఫీట్‌ను ఈ మహిళ రెండు సార్లు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. గత ఏడాది ఆగస్టులో బుర్జ్ ఖలీఫాపై నిలబడి ఎమిరేట్స్ విమానయాన సంస్థకు యాడ్ చేసిన నికోల్ స్మిత్ లడ్విక్ మరోసారి ఆ ఫీట్‌ను సాధించింది. ఈ సారి కూడా అదే సంస్థకు యాడ్ చేసి పెట్టింది.
ఏమాత్రం తణుకు బెణుకు లేకుండా మొహంలో అదే చిరునవ్వు చిందిస్తూ 'నేనింకా ఇక్కడే ఉన్నాను' అంటూ ఈసారి నికోల్ వీక్షకుల్ని పలకరించింది. అయితే ఈసారి యాడ్‌లో ఎమిరేట్స్ (Emirates) విమానయాన సంస్థకు చెందిన ఓ భారీ విమానం కూడా కనిపించడం విశేషం. ఆమె అత్యున్నత శిఖరంపై నిల్చొని ప్లకార్డులను ప్రదర్శిస్తుండగా.. ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఎయిర్‌బస్ ఏ380 విమానం ఆమె చుట్టూ చక్కర్లు కొట్టడం అందరినీ ఆకర్షిస్తోంది. ఈ అసాధారణ సాహసాన్ని రెండోసారి చేసిన నికోల్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
దుబాయ్ వేదికగా జరుగుతున్న 'దుబాయ్ ఎక్స్‌పో 2020'ని ప్రమోట్ చేస్తూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ప్రభుత్వ అధీనంలోని ఎమిరేట్స్ విమానయాన సంస్థ ఈ యాడ్‌ను రూపొందించింది. 59 సెకన్ల నిడివి గల ఈ యాడ్ ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ‘‘నేనింకా ఇక్కడే ఉన్నాను. వావ్.. నాకు దుబాయ్ ఎక్స్‌పో కనిపిస్తోంది. ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రదర్శనల్లో ఒకటైన దీన్ని వీక్షించడానికి ఎమిరేట్స్ ఏ380లో విహరిస్తూ రండి మిత్రులారా!'' అంటూ నికోల్ ప్లకార్డుల ద్వారా అందరికీ స్వాగతం పలికింది. జనవరి 14న విడుదల చేసిన ఈ యాడ్‌కు యూట్యూబ్‌లో ఇప్పటి వరకు 6 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. జనవరి 17న మేకింగ్ వీడియోను సైతం విడుదల చేశారు.