Britain Omicron Cases: ప్రపంచదేశాల్లో ఒమిక్రాన్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. బ్రిటన్‌లో శుక్రవారంతో పోల్చితే.. శనివారం మూడు రెట్లు అధికంగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే ఏకంగా 10,059 మంది ఒమిక్రాన్ బారిన పడ్డారు. దీంతో బ్రిటన్‌లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 24,968కు చేరింది.
ఇక దేశంలో కొవిడ్-19తో శనివారం 132 మంది మృతిచెందారు. యూకేలో ఒమిక్రాన్ వ్యాప్తిని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నామని ఆ దేశ ఆరోగ్య సెక్రటరీ సాజిద్ జావిద్ తెలిపారు. వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై శాస్త్రవేత్తలతో చర్చిస్తున్నామన్నారు.
బ్రిటన్‌లో ఒమిక్రాన్, కొవిడ్-19 వ్యాప్తి దృష్ట్యా.. ఈ నెల చివర్లో రెండు వారాల పాటు సడలింపులతో కూడిన లాక్డౌన్ విధించేందుకు బ్రిటన్ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నట్లు అక్కడి మీడియా కథనాల్లో వస్తోంది.
బ్రిటన్‌పై జర్మనీ ఆంక్షలు..
Germany Omicron Travel Restrictions: ప్రపంచదేశాల్లో ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ప్రయాణ ఆంక్షలను కఠినతరం చేసింది జర్మనీ. బ్రిటన్‌లో అత్యధికంగా ఒమిక్రాన్ కేసులు నమోదవుతుండటం కారణంగా.. ఆ దేశం నుంచి వచ్చే ప్రజలకు ఆంక్షలను కఠినతరం చేసింది. ఈ మేరకు 'వైరస్ వేరియంట్ ప్రాంతాలు' జాబితాలో బ్రిటన్ను చేర్చింది జర్మనీ ప్రభుత్వం. ఈ నిబంధనల ప్రకారం బ్రిటన్ నుంచి వచ్చే ప్రయాణికులు 14 రోజులపాటు తప్పనిసరిగా క్వారంటైన్లో ఉండాలి. వ్యాక్సినేషన్ పూర్తయినా ఈ రూల్స్ పాటించాల్సిందే. నూతన నిబంధనలు ఆదివారం రాత్రి నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొంది జర్మనీ సర్కార్.
ఇరాన్‌లోకి ఒమిక్రాన్ ఎంట్రీ..
Omicron Cases In Iran: ఇరాన్లో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఈ మేరకు అక్కడి మీడియా పేర్కొంది. ఇరాన్లో 60 శాతం జనాభాకు వ్యాక్సినేషన్ పూర్తయింది. 5 కోట్ల మంది రెండు డోసులు తీసుకోగా, దాదాపు 35 లక్షల మందికి బూస్టర్ డోసు సైతం పూర్తయినట్లు సమాచారం. ఇప్పటికే కొవిడ్-19 కారణంగా ఇరాన్లో 131,000 మంది ప్రాణాలు కోల్పోయారు. వ్యాక్సినేషన్ కారణంగా ఇటీవలి కాలంలో మరణాలు తగ్గినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒమిక్రాన్ నేపథ్యంలో ప్రజలంతా బూస్టర్ డోసు తీసుకోవాలని ఇరాన్ ప్రభుత్వ వర్గాలు సూచిస్తున్నాయి.
ప్రజలంతా వ్యాక్సిన్ తీసుకోవాలి..