కరోనా మహమ్మారిపై పోరాటానికి భారత్కు సాయం చేసింది బ్రిక్స్ దేశాల కూటమికి చెందిన న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ). కొవిడ్-19 వ్యాప్తిని అరికట్టడం, మానవ, సామాజిక, ఆర్థిక అసమానతలను రూపుమాపేందుకు అత్యవసర సహాయం కింద 1 బిలియన్ డాలర్లు రుణం అందించింది.
భారత్కు అత్యవసర సహాయ రుణం అందించేందుకు ఏప్రిల్ 30న ఎన్డీబీ బోర్డు ఆమోదం తెలిపింది. రుణ సాయం పై ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు బ్యాంకు ఉపాధ్యక్షుడు జియాన్ ఝూ.
ఈ విపత్కర పరిస్థితుల్లో బ్రిక్స్ సభ్యదేశాలకు పూర్తి స్థాయిలో అండగా నిలవాలని ఎన్డీబీ నిర్ణయించింది. కరోనా పై పోరులో అవసరమైన నిధుల కోసం భారత ప్రభుత్వం చేసిన వినతికి త్వరితగతిన స్పందించి ఈ రుణం మంజూరు చేశాం. సామాజిక భద్రతను బలోపేతం చేయటం, ఆరోగ్య విభాగం అత్యవసర సేవలకు జనవరి 1 నుంచి ఇప్పటి వరకు చేసిన ఖర్చు, 2021, జనవరి 1 వరకు వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు, సామాజిక భద్రత కోసం చేసే వ్యయం ఈ ఆర్థిక సాయం పరిధిలో ఉంటుంది.
– జియాన్ ఝూ, ఎన్డీబీ ఉపాధ్యక్షుడు.
కరోనా నుంచి కలిగే ముప్పును ఎదుర్కోవటం, నిరోధించటం, గుర్తిచటం సహా తగిన విధంగా స్పందించేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయని తెలిపారు జియాన్. భారత్లో ఆరోగ్య వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచే విధంగా క్లిష్టతరమైన ఆరోగ్య చికిత్సలకు నిధులు సమకూర్చటం, జాతీయ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయటం, ఆర్థిక, సామాజిక వ్యవస్థలను పునరుద్ధరించే కార్యక్రమాలకు తక్షణ సాయం అందించటం దీని ముఖ్య ఉద్దేశమని చెప్పారు.