'చైనా సరకు'.. ఈ పదం సాధారణంగా నాసిరకం సామగ్రికి వాడే సర్వనామంగా మారిపోయింది. ఇప్పుడు టీకా విషయంలో కూడా అదే రుజువైంది. ఇప్పటి వరకు వినియోగంలో ఉన్న వాటిల్లో అత్యల్ప సామర్థ్యం చైనా టీకాదే. చైనాలో ప్రభుత్వ రంగానికి చెందిన సినోవాక్ టీకా కేవలం 50.4శాతం సామర్థ్యం మాత్రమే కలిగి ఉందని ప్రయోగపరీక్షల్లో తేలింది. ఈ విషయాన్ని బ్రెజిల్ పరిశోధకులు మంగళవారం ప్రకటించారు. సాధారణంగా ఒక టీకా ఆమోదం పొందాలంటే 50శాతం సామర్థ్యం ఉంటే చాలు. ఇప్పుడు చైనా టీకా ఆ మార్కును మాత్రమే దాటింది. ఈ ఫలితాలు బ్రెజిల్ ప్రభుత్వాన్ని తీవ్ర నిరాశకు గురిచేశాయి. "ఇదొ మంచి టీకా.. అంతే కానీ, ప్రపంచంలోనే అత్యుత్తమమైంది కాదు. అదే సమయంలో ఆదర్శవంతమైంది కూడా కాదు" అని మైక్రోబయాలజిస్టు నటాలియా పాస్టెర్నక్ తెలిపారు.
వారంలోనే ఎంత మార్పు..
ఈ టీకాకు 78 శాతం సామర్థ్యం ఉందని గత వారం బ్రెజిల్‌కు చెందిన బుటాంటన్ ఇన్‌స్టిట్యూట్ పాక్షిక ఫలితాల్లో ప్రకటించినట్లు గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. నాటి ప్రకటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వల్ప నుంచి తీవ్రమైన కేసుల విషయంలో 78 శాతం ఉందని పేర్కొంది. దీనిలో అత్యంత స్వల్ప కేసుల గ్రూపు డేటాను చేర్చలేదు. తాజాగా ఆ గ్రూపు డేటా కూడా చేర్చడంతో సామర్థ్యం 50.4కు తగ్గిపోయింది. బుటాంటన్ ప్రకటనపై సావోపాలోలోని పబ్లిక్ హెల్త్ యూనివర్శిటీ ప్రొఫెసెర్ గొన్జాలో అసహనం వ్యక్తం చేశారు. "మాకు మరింత మెరుగ్గా స్పష్టంగా సమాచారం చెప్పేవారు కావాలి" అని వ్యాఖ్యానించారు. ఈ టీకా తీసుకొన్న వారు సైడ్ ఎఫెక్ట్‌లతో ఆస్పత్రి పాలుకాకపోవడమే పెద్ద ఊరట అని నిపుణులు అంటున్నారు.
బుటాంటన్ ఇన్‌స్టిట్యూట్ తీరుపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే టీకా పరీక్షల ఫలితాలను మూడుసార్లు వాయిదా వేసి అధికారుల సహనాన్ని పరీక్షించింది. దీంతోపాటు సినోవాక్‌తో చేసుకొన్న ఒప్పందంలో సమాచారాన్ని రహస్యంగా ఉంచాలనే షరతుకు అంగీకరించింది.
కొత్తగా వెలువడిన డేటాతో బ్రెజిల్‌లో టీకా కార్యక్రమానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లైంది. బుటాంటన్‌ను ప్రభుత్వ వర్గాలు అదనపు డేటాను సమర్పించాలని ఆదేశించాయి. ఇప్పటి వరకు బ్రెజిల్ కేవలం చైనా టీకాతోపాటు.. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా టీకాపై ఆధారపడింది.
మా దేశంలో ప్రయోగాలు వద్దు..
చైనా టీకా ప్రయోగ పరీక్షలు, కొనుగోళ్లకు సంబంధించిన డీల్స్‌ను చాలా దేశాలు రద్దు చేసుకొన్నాయి. బంగ్లాదేశ్‌లో సినోవాక్ టీకా ప్రయోగ పరీక్షలకు చైనా తొలుత ఒప్పందం కుదుర్చుకొంది. కానీ, ఆ తర్వాత ప్రయోగ పరీక్షలకు అయ్యే ఖర్చులో కొంత మొత్తాన్ని బంగ్లాదేశ్ భరించాలని కొర్రీ పెట్టింది. దీంతో ఈ ఒప్పందాన్ని బంగ్లాదేశ్ రద్దు చేసుకొంది. బ్రెజిల్ కూడా కొన్నాళ్లు ఈ టీకా ప్రయోగ పరీక్షలను నిలిపివేసింది. ఇక అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఏషియన్ నేషన్స్(ఆసియాన్) దేశాలకు టీకా పంపిణీలో ప్రాధాన్యం ఇస్తామని చైనా ప్రీమియర్ లీ కిక్యూంగ్ ప్రకటించారు. ఆ తర్వాత ఫిలిప్పీన్స్, థాయ్‌ల్యాండ్, మలేషియా దేశాలు అమెరికా, బ్రిటన్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకొని చైనాకు షాక్ ఇచ్చాయి. దీనికి కారణం ఉంది. చైనా ఇచ్చే టీకాలకు ప్రతిఫలంగా ప్రపంచ ఆరోగ్య సంస్థలో చైనాకు మద్దతు తెలిపాలని షరతు పెట్టింది. దీంతో ఆ దేశాలు వేరే టీకాల వైపు మొగ్గు చూపాయి.
చైనాలో లక్షల మందికి..
ప్రయోగదశలోనే ఉన్న కరోనా టీకాలను చైనాలో విచ్చలవిడిగా వాడేస్తున్నారు. 'అత్యవసర వినియోగం' పేరుతో ఇబ్బడిముబ్బడిగా వ్యాక్సిన్లు ఇస్తున్నారు. చైనాలో పలు సంస్థలు కరోనాకు టీకాలను అభివృద్ధి చేస్తున్నాయి. ముప్పు అధికంగా ఉన్నవారికి 'అత్యవసర అనుమతి' కింద ఆ వ్యాక్సిన్లను ఇచ్చేందుకు చైనా ప్రభుత్వం జూన్‌లో అనుమతినిచ్చింది. కంపెనీలు మాత్రం లక్షల మందికి టీకాలు ఇచ్చేస్తున్నాయి. టీకాల భద్రత, సమర్థతను నిర్ధరించే ప్రయోగాలు ప్రారంభం కాకముందే తమ ఉద్యోగులు, పరిశోధకులకు టీకాలు ఇవ్వడం ద్వారా చైనా కంపెనీలు కలకలం సృష్టించాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలోని సినోఫార్మ్‌కు చెందిన 'సీఎన్‌బీజీ'.. సుమారు 3.5 లక్షల మందికి ఈ టీకాను ఇచ్చింది. మరో సంస్థ సినోవాక్.. తన ఉద్యోగులు, కుటుంబ సభ్యుల్లో 90 శాతం మందికి వ్యాక్సిన్‌ను ఇచ్చింది. చైనా సైన్యం, కానాసినో అనే ఔషధ సంస్థ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న టీకాను సైనిక సిబ్బందికి అత్యవసర వినియోగం కింద ఇవ్వడానికి ఆమోదం లభించింది. టెలికం దిగ్గజం హువావే, ప్రసార సంస్థ ఫీనిక్స్ టీవీ తదితర కంపెనీలూ తమ ఉద్యోగులకు సినోఫార్మ్ ద్వారా టీకాలు ఇప్పించేందుకు చర్యలు మొదలుపెట్టాయి.
ఇదీ చూడండి:'18వేలకుపైగా అమెరికా సంస్థలపై సైబర్ దాడి'