భారత్‌తో సరిహద్దులో ఘర్షణలకు ఆజ్యం పోస్తూ 20 మంది జవానులను పొట్టనబెట్టుకున్న చైనాకు వ్యతిరేకంగా దేశం మొత్తం 'చైనా వస్తువుల బహిష్కరణ' మంత్రం జపిస్తోంది. చైనా ఉత్పత్తులపై నిషేధం విధించాలని డిమాండ్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై చైనా అధికారిక వార్తా పత్రిక గ్లోబల్ టైమ్స్ తీవ్రంగా స్పందించింది. చైనాలో తయారైన వస్తువులు లేని జీవనాన్ని భారతీయులు భరించలేరంటూ వ్యాఖ్యానించింది. ఈ మేరకు పత్రికలో ఓ వ్యాఖ్యానం ప్రచురితమైంది.
ఇదీ చూడండి:భారత్‌లో చైనా వస్తువులను నిషేధిస్తే నష్టమెవరికి?
భారత్‌కు చైనా అవసరం
గల్వాన్ లోయలో జరిగిన ఘటనను 'దురదృష్టకర ఘర్షణ'గా అభివర్ణించింది గ్లోబల్ టైమ్స్. దీన్ని చైనా పట్ల విద్వేషాన్ని రేకెత్తించేలా రాజకీయాలు, కుట్ర సిద్ధాంతాల కోసం ఉపయోగించుకోరాదని హితవు పలికింది. ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసుకోవడానికి భారత్ ఆధారపడే అతిపెద్ద పొరుగు దేశం చైనానే అని వ్యాఖ్యానించింది. సరిహద్దులో శాంతి నెలకొంటేనే ఆసియాలో రెండు అతిపెద్ద దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య సంబంధాలు మెరుగుపడి ఇరు దేశాలకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొంది.
"తాజా సరిహద్దు ఘర్షణలు మరింత తీవ్రం కాకుండా, ద్వైపాక్షిక సంబంధాలు దిగజారకుండా ఇరుదేశాలు శాయశక్తులా ప్రయత్నించాలి. భారత్‌లోని చాలా మంది టీవీ వ్యాఖ్యాతలు, వార్తా పత్రికల విశ్లేషకులు సరిహద్దు ఘర్షణను మరింత పెంచుతున్నారు. కయ్యానికి కాలు దువ్వే విధంగా చైనాకు భారత్ గట్టి బదులు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వాటితో భారతీయులు మోసపోరని అనుకుంటున్నాం. ఆర్థికంగా, రాజకీయ, భౌగోళికంగా భారత్‌కు చైనా అవసరం."
-గ్లోబల్ టైమ్స్ వ్యాఖ్యానం
భారత దేశానికి చైనా అనేక అవకాశాలను అందిస్తోందని వ్యాఖ్యానం పేర్కొంది. భారత్‌లో ఉన్న టాప్-30 స్టార్టప్‌లలోని 18 సంస్థల్లో చైనా పెట్టుబడులు పెట్టినట్లు తెలిపింది.
ఇదీ చూడండి:'బాయ్‌కాట్ చైనా' సాధ్యమేనా? లాభదాయకమేనా?
"ఇళ్లలో రోజూ ఉపయోగించే కలర్ టీవీలు, మైక్రోవేవ్ ఒవెన్లు, ఏసీలు, ఫోన్లు, ల్యాప్టాప్లన్నింటినీ చైనాలోనే తయారు చేస్తున్నాం. అందుబాటు ధరల్లోనే ఈ నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తున్నాం. చైనా ఉత్పత్తులను వేరే వాటితో భర్తీ చేసుకోవడం చాలా కష్టం."