అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్లో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఐదుగురు మరణించారు. ఈ ఉదయం సుమారు 7 గంటల సమయంలో ఓ దుండగుడు తన వెంట తెచ్చుకున్న పేలుడు పదార్థాలతో దాడికి పాల్పడ్డాడు. ముగ్గురు భద్రతా సిబ్బంది సహా ఇద్దరు పౌరులు ఈ ఘటలో ప్రాణాలు కోల్పోయినట్లు అఫ్గాన్ అంతర్గత వ్యవహారాల శాఖ అధికారులు వెల్లడించారు. మరో ఆరుగురు గాయపడ్డట్లు ఆ దేశ రక్షణ శాఖ ప్రకటించింది.
మార్షల్ ఫాహిం మిలటరీ అకాడమీ సమీపంలో పేలుడు సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పేలుడు అనంతరం తుపాకీ శబ్దాలు వినిపించినట్లు వెల్లడించారు. గతంలోనూ ఈ ప్రాంతంలో పలు దాడులు జరగడం గమనార్హం.