జమ్ముకశ్మీర్ అంశాన్ని మరోసారి అంతర్జాతీయ వేదికపై ప్రస్తావించిన పాకిస్థాన్‌కు.... గట్టిగా బుద్ధి చెప్పింది భారత్. రాష్ట్రంలో ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసి, నిర్బంధకాండ అమలు చేస్తున్నారని పాకిస్థాన్ చేసిన ఆరోపణలను తిప్పికొట్టింది. మంగళవారం మానవ హక్కుల మండలి (యూఎన్ హెచ్ఆర్సీ) 42 వ సదస్సులో పాక్ అర్థంలేని మాటలను భారత్ తీవ్రంగా ఖండించింది.
ఉగ్రవాద దేశం నుంచి విమర్శలా?:భారత్
పాక్ చేసిన ఆరోపణలను ఎండగడుతూ ఆ దేశం పేరు ప్రస్తావించకుండానే విరుచుకుపడ్డారు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ ఠాకూర్ సింగ్. ''మా దేశంపై ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వారు ఉగ్రవాదానికి కేంద్ర బిందువుగా ఉన్నారని, ఏళ్ల తరబడి ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నారని'' అన్నారు.
"దేశాలు ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదం కారణంగా ప్రపంచ దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. ముఖ్యంగా భారత్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ప్రాథమిక జీవనానికి విఘాతం కల్గిస్తున్న ఉగ్రవాద సంస్థలపై కఠిన చర్యలు తీసుకునేందుకు సమష్టిగా ముందుకు రావాల్సిన సమయం వచ్చింది. ఉగ్రవాద సంస్థలకు, వారిని ప్రోత్సహిస్తున్నవారి గురించి గళమెత్తాల్సిన అవసరముంది.
ఇక్కడున్న ఓ ప్రతినిధి బృందం నా దేశం గురించి నిరాధారమైన తప్పుడు ఆరోపణలు చేస్తోంది. వాక్చాతుర్యంతో కూడిన ఆ వ్యాఖ్యానాలు అంతర్జాతీయ తీవ్రవాదానికి కేంద్రబిందువుగా ఉన్న ప్రాంతం చేస్తోందని ప్రపంచం మొత్తానికి తెలుసు. ఉగ్రవాద సంస్థల కీలకనాయకులు ఏళ్ల తరబడి అక్కడ ఆశ్రయం పొందుతున్నారు. దౌత్య వ్యూహాల్లో ఉగ్రవాదాన్ని ఒక విధానంగా ఆ దేశం ప్రోత్సహిస్తోంది."
-విజయ్ థాకూర్ సింగ్, విదేశీ వ్యవహారాలశాఖ (తూర్పు) కార్యదర్శి