హాంకాంగ్ నిరసనకారులకు మద్దతు ప్రకటిస్తూ అమెరికా సెనేట్ తీసుకున్న నిర్ణయాన్ని చైనా తీవ్రంగా తప్పుబట్టింది. ఈ విషయంపై తగిన వివరణ ఇవ్వాల్సిందిగా చైనాలోని అమెరికా రాయబారికి సమన్లు జారీ చేసింది. హాంకాంగ్ హక్కులపై వేసిన బిల్లు... చట్టంగా రూపుదాల్చితే అత్యంత తీవ్రమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది.
తమ నిరసన వ్యక్తం చేయడానికి అమెరికా దౌత్యవేత్త విలియం క్లేయిన్ను విదేశాంగ కార్యాలయానికి పిలిచినట్లు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. చైనా అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకోవడం ఆపాలని హితవు పలికింది.
'అమెరికా ప్రవేశపెట్టిన బిల్లు చట్టరూపం దాల్చకుండా అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని మేం గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే దాన్ని ఎదుర్కొవడానికి చైనా కఠినమైన చర్యలు తీసుకుంటుంది. తర్వాత ఎటువంటి పరిణామాలు సంభవించినా అమెరికా భరించాల్సి ఉంటుంది.'
-చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ.