ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు ఆయా దేశాలు అష్టకష్టాలు పడుతున్నాయి. ఈ ముప్పు ఇప్పుడే తొలగిపోదని ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు అంతర్జాతీయంగా ఉన్న నిపుణులు కూడా హెచ్చరిస్తూనే ఉన్నారు. తప్పనిసరిగా భౌతిక దూరం పాటించడంతోపాటు, మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో.. వైరస్‌కు మూలకారణమైన చైనాలో మాత్రం నిబంధనలు సడలిస్తుండడం గమనార్హం. తాజాగా వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టడంతో మాస్కులపై ఉన్న నిబంధనలను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. చైనా రాజధాని బీజింగ్‌లో మాస్కులు లేకుండానే ప్రజలు బయట తిరగవచ్చని అధికారులు వెల్లడించారు.
ఇది రెండోసారి..
మాస్కులపై ఉన్న నిబంధనలను బీజింగ్ అధికారులు తొలగించడం ఇది రెండోసారి. ఏప్రిల్ నెలలో కరోనా వైరస్ తీవ్రత తగ్గడంతో మాస్కులు లేకుండా ప్రజలు బయటకు వెళ్లవచ్చని తొలిసారి ప్రకటించారు. అనంతరం మూడు నెలల తర్వాత ఓ హోల్‌సేల్ మార్కెట్ వైరస్‌వ్యాప్తికి కేంద్రంగా మారడంతో మాస్కులు తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.