చైనాలో కరోనా(China Corona Update) వ్యాప్తి కలకలం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో వైరస్ కట్టడి కోసం అక్కడి అధికారులు కఠిన ఆంక్షలు(Beijing Coronavirus Restrictions) విధిస్తున్నారు. చైనా రాజధాని బీజింగ్‌లో ఎవరైతే నగరాన్ని వీడి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లారో... వారు తిరిగి బీజింగ్‌కు చేరుకునే ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ఆదేశించారు. కొవిడ్ కేసులను సున్నా స్థాయికి పరిమితం చేసేందుకు ఈ మేరకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
"నగరాన్ని దాటి వివిధ ప్రాంతాల్లో పర్యటించినవారు.. ఆయా ప్రాంతంలో వైరస్ కేసులు వెలుగు చూసినట్లైతే.. తిరిగి నగరానికి రావద్దు. పర్యటనలు పూర్తి చేసుకుని ఇప్పటికే చేరుకున్నవారు.. స్థానిక అధికారులకు తెలియజేయాలి, స్వీయ నిర్బంధంలో ఉండాలి."
-బీజింగ్ హెల్త్ కమిషన్.
అత్యవసరం అయితే మినహా నగరం దాటి ప్రజలు బయటకు వెళ్లకూడదని బీజింగ్(Beijing Coronavirus Restrictions) అధికారులు తెలిపారు. 16 మున్సిపాలిటీలు, రాష్ట్రాల్లో వైరస్ పాజిటివ్ కేసులు(China Corona Update) ఉన్నందున ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ప్రజల ప్రయాణ రికార్డులను పరిశీలించేందుకు ఇంటింటికి వెళ్లి ఆరోగ్య అధికారులు సమాచారం సేకిరిస్తున్నారు.
గత నెలలో 20 కరోనా కేసులు నమోదు కాగా.. బీజింగ్‌లో ఆదివారం స్థానికంగా వ్యాప్తి చెందిన కేసులు(China Corona Update) వెలుగు చూశాయి. నవంబరు 8 నుంచి 11 మధ్య చైనా అధికార పార్టీ- కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా(సీపీసీ) బీజింగ్ నగరంలో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ కార్యక్రమంలో దాదాపు 375 మందికిపైగా అధికారులు పాల్గొననున్నారు. సీపీసీ నాయకత్వ మార్పు వచ్చేఏడాది జరగనున్న నేపథ్యంలో.. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో శీతాకాల ఒలింపిక్స్ కూడా బీజింగ్‌లో జరగనున్నాయి. వందలాది మంది అంతర్జాతీయ క్రీడాకారులు ఈ పోటీలకు హాజరవనున్నారు. ఈ నేపథ్యంలో... వైరస్ నియంత్రణ కోసం అధికారులు కఠిన చర్యలు(Beijing Coronavirus Restrictions) చేపడుతున్నారు.