బహ్రెయిన్ దేశానికి దీర్ఘ కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా(84) అనారోగ్యంతో కన్నుమూశారు. ఖలీఫా...అమెరికాలోని మయో క్లినిక్‌లో చికిత్స పొందుతూ చనిపోయారని బహ్రెయిన్‌లోని ఓ మీడియా సంస్థ వెల్లడించింది.
ఆరోపణలూ ఎదుర్కొని...
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కాలం ఒక దేశానికి ప్రధానిగా పనిచేసిన ఘనత బిన్ సల్మాన్ అల్ ఖలీఫాదే. కానీ, 2011లో ఈయన అవినీతి ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు.
గల్ఫ్ దేశాల పరిపాలనను అనుసరించే బహ్రెయిన్ ప్రిన్స్ ఖలీఫా... సున్నీ అల్ ఖలీఫా వర్గానికి మద్దతుగా నిలిచేవారు. కానీ, 2011లో షియా ముస్లింలు, ఇతర వర్గాలు ఈయనపై అవినీతి ఆరోపణలు చేస్తూ నిరసనలు చేశారు.
ఈ క్రమంలోనే విదేశీ వ్యవహారాల్లో అవినీతికి పాల్పడిన అల్యూమినియం కంపెనీ 'అల్కోవా'పై కేసు నమోదైంది. దీనిలో ప్రిన్స్ ఖలీఫా ముఖ్య పాత్ర పోషించినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ కేసును తప్పించుకునేందుకు అల్కోవా కంపెనీ... అమెరికా ప్రభుత్వానికి 384 మిలియన్ డాలర్ల జరిమానా కట్టింది.
దాదాపు 200 ఏళ్ల పరిపాలన!
బహ్రెయిన్‌ను దాదాపు 200 ఏళ్లు పరిపాలించిన అల్ ఖలీఫా వంశంలో జన్మించారు ప్రిన్స్ ఖలీఫా. ఈయన తండ్రి షేక్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా.
బహ్రెయిన్ 1971లో బ్రిటన్ నుంచి స్వాతంత్య్రం పొందింది. ఈ సమయంలో దేశ ప్రధాని పగ్గాలు చేపట్టారు ప్రిన్స్ ఖలీఫా. దేశ రాజధాని మనామాను ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో ప్రిన్స్ కీలక పాత్ర పోషించారు.
ఇదీ చదవండి:డెమొక్రాట్లదే అమెరికా ప్రతినిధుల సభ.. కానీ