జైషే మహ్మద్ అధినేత మసూద్ అజార్‌పై చైనా మరోమారు తన వక్రబుద్ధి చూపింది. అజార్‌పై నిర్ణయం తీసుకునేందుకు ఎలాంటి గడువు లేదని ప్రకటించింది. ఐరాసలో అజార్‌పై ఆంక్షల జాబితాలో చేర్చేందుకు అడ్డంకులను ఈ నెల 23లోపు ఎత్తివేయాలని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ అల్టిమేటం జారీ చేశాయన్న వార్తల్లో నిజం లేదని డ్రాగన్ దేశం తెలిపింది.
అయితే అజార్ విషయంలో త్వరలోనే పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
పుల్వామా ఉగ్రదాడి అనంతరం ఐరాస భద్రత మండలిలోని 1267 అల్‌ఖైదా ఆంక్షల కమిటీ జాబితాలో అజార్‌ను చేర్చాలని ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికా ప్రతిపాదించాయి. దీనికి మరింత సమయం కావాలంటూ చైనా అడ్డుపుల్ల వేసింది. ఈ సమస్య 1267 కమిటీ ఆధ్వర్యంలోనే పరిష్కారం కావాలని చైనా తెలిపింది.
అజార్‌పై సాంకేతిక నిలుపుదలను ఈ నెల 23లోపు తొలగించాలని మూడు దేశాలు అల్టిమేటం ఇచ్చాయన్న నివేదికలపై చైనా విదేశాంగ మంత్రి లూకంగ్ స్పందించారు.
"ఈ సమాచారం ఎక్కడి నుంచి పొందారో అక్కడే మీరు స్పష్టీకరణ చేసుకోవాలి. చైనా వైఖరి స్పష్టంగా చెప్పాం. సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరకుండా ఎలాంటి చర్యలు సంతృప్తికర ఫలితాలు ఇవ్వవని మేము నమ్ముతున్నాం. అజార్‌ను అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తించాలన్న సమస్యపై చైనా వైఖరి మారదు. మేము సంబంధిత పక్షాలతో సంప్రదింపులు జరుపుతాం. ఈ విషయం పరిష్కారం దిశగా కదులుతోంది. " - లూకంగ్, చైనా విదేశాంగ మంత్రి.
అమెరికాపై పరోక్షంగా విమర్శలు చేశారు లూ కాంగ్. ఐరాస భద్రత మండలి సభ్యుల అభిప్రాయాన్ని సంబంధిత దేశం గౌరవిస్తుందని భావిస్తున్నామని తెలిపారు. ఆంక్షల కమిటీ సభ్యుల మధ్య సహకార పద్ధతిలోనే ఈ సమస్యకు సరైన పరిష్కారం లభిస్తుందన్నారు.