ఆస్ట్రేలియా కార్చిచ్చు బాధితుల సహాయార్థం 10 వేల కోట్లు ఆస్ట్రేలియాలో కార్చిచ్చు బాధితులకు తక్షణ సహాయార్థం 2 బిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల (రూ.10వేల కోట్లు) ప్యాకేజీ ప్రకటించారు ఆ దేశ ప్రధాని స్కాట్ మోరిసన్. కంగారూ ద్వీపంలో దావానలం ధాటికి ఇప్పటివరకు 24 మంది చనిపోయారు. 2 వేల ఇళ్లు దగ్ధమవగా వేలాది మూగజీవాలు మరణించాయి.
అగ్ని కీలల ధాటికి న్యూ సౌత్ వేల్స్లోని వందలాది ఇళ్లు ఆహుతయ్యాయి. గంటకు 90 కిలోమీటర్ల వేగంతో వేడి గాలులు వీస్తుండటం వల్ల ఆస్ట్రేలియాలోని పలు ప్రధాన నగరాలలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. న్యూసౌత్ వేల్స్లోని కార్చిచ్చు బాధితులకు సహాయక సామగ్రిని అందజేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. అత్యవసర సరకులను కార్చిచ్చు ప్రభావిత ప్రాంతాల్లో పంపిణీ చేశారు.
ఎన్నడూ లేనంతగా..
ప్రస్తుతం 'ఎన్నడూ లేని విధంగా విపత్కర పరిస్థితి'ని ఆస్ట్రేలియా ఎదుర్కొంటుందని అధికారులు తెలిపారు. అమెరికా, మేరీల్యాండ్ కార్చిచ్చు కన్నా రెండు రెట్లు అధికంగా ఆస్ట్రేలియాను ఈ దావానలం ఆవహించింది. కార్చిచ్చు ధాటికి ఇప్పటి వరకు 24 మంది చనిపోయారు. దాదాపు 2000 ఇళ్లు దగ్ధమైపోయాయి.
మూగజీవాలు విలవిల
కార్చిచ్చు తీవ్రతకు మూగజీవులు విలవిల్లాడుతున్నాయి. దావానలం కారణంగా కంగారూ ద్వీపంలోని కొన్ని ప్రత్యేకమైన వన్యప్రాణులు పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం ఏర్పడింది. ఆస్ట్రేలియాలోని జీవారణ్య పార్కు నిర్వహకులు గాయపడిన కోలా బేర్, కంగారూలను చేరదీసి చికిత్స అందిస్తున్నారు.
ఇదీ చూడండి:రగులుతోన్న ఆస్ట్రేలియా.. రాలిపడుతున్న మూగజీవాలు!