ఆస్ట్రేలియాలో ఓవైపు నూతన సంవత్సరపు బాణాసంచా వెలుగులు ప్రజల్లో సంతోషాలు నింపుతుంటే, కార్చిచ్చు మరికొందరి జీవితాలను దహించివేస్తోంది. కొద్ది రోజులుగా రగులుతున్న ఈ మంటలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. న్యూసౌత్‌వేల్స్‌లోని కొంజోలా పార్క్, విక్టోరియాలోని మల్లకూటలోని పలు ప్రాంతాలు అగ్నికి ఆహుతయ్యాయి. కొంజోలాలో 50కి పైగా నిర్మాణాలు, డజన్‌కుపైగా కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.
కార్చిచ్చు సృష్టించిన విధ్వంస చిత్రం - ఆస్ట్రేలియా దావానలం
ఓ వైపు ఆస్ట్రేలియాలోని సిడ్నీలో నూతన సంవత్సర వేడుకలు అంబరాన్ని అంటుతుంటే... మరోవైపు విక్టోరియా నగరంలో చెలరేగిన కార్చిచ్చు ధాటికి ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. విక్టోరియాతో పాటు న్యూసౌత్‌వేల్స్ ప్రాంతంలో మంటల కారణంగా పలు నిర్మాణాలు పూర్తిగా కాలిపోయాయి. దావానలం నుంచి కాపాడుకోవడానికి ప్రజలు సమీపంలోని బీచ్ వద్ద తలదాచుకున్నారు.
విక్టోరియాలోని మల్లకూట ప్రాంతంలో పదుల సంఖ్యలో నివాసాలు కాలిపోయాయి. తీవ్రంగా మారిన కార్చిచ్చు నుంచి కాపాడుకోవడానికి 4 వేల మందికి పైగా ప్రజలు సమీపంలోని బీచ్‌కు తరలివెళ్లారు. ప్రఖ్యాత పర్యటక ప్రదేశమైన ఈ ప్రాంతానికి చేరుకునే రహదారులు మూతపడ్డాయి.
పరిస్థితి కాస్త కుదుటపడటం వల్ల మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకురావడానికి అగ్నిమాపక దళాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ కార్చిచ్చు కారణంగా మంగళవారం ఇద్దరు మృతి చెందినట్లు తెలిపారు. మరొకరు గల్లంతయ్యారని చెప్పారు.